ఆసిఫాబాద్, జూన్ 20 : తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సహకారం ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎస్పీ కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్, చంద్రాపూర్ ఎస్పీ రవీంద్రసింగ్ పరదేశి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరిహద్దుల ద్వారా ఎలాంటి అవినీతి, అక్రమాలు జరుగకుండా అరికట్టాలన్న ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
సరిహద్దుల వద్ద పటిష్టంగా భద్రత చర్యలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రాపర్టీ దొంగతనాలకు సంబంధించిన కేసులు, ఇతరత్రా నేరాలు చేసే ముఠాలను పట్టుకోవడం, ఇతర కేసులను సత్వరం పరిషరించుకోవడంలో సహకారం అందించాలని తెలిపారు. ఆసిఫాబాద్, చంద్రాపూర్ జిల్లాల్లో భద్రత చర్యలను ఎస్పీలు ఒకరికొకరు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సుధాకర్, వాంకిడి, కౌటాల సీఐలు శ్రీనివాస్, సాదిక్ పాషా పాల్గొన్నారు.