ఇంద్రవెల్లి : మండలంలోని హర్కాపూర్ తండా, ఈశ్వర్ నగర్, బీక్కుతండా, వాగాయితండా, ఏమాయికుంట గ్రామాల్లో శనివారం తీజ్ పండుగ ( Teej celebrations ) ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రాఖీ పౌర్ణమి నుంచి ప్రారంభమైన తీజ్ ఉత్సవాల్లో గ్రామాల్లో పెళ్లి కాని యువతులు గ్రామ నాయక్ (గ్రామపెద్ద) ఇంట్లో వెదురు బుట్టలో గోదుమలు వేసి నారు మొలకెత్తే వరకు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నీరు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శనివారం గోకులాష్టమి పండుగ సందర్భంగా తీజ్ ఉత్సవాలను ముగించారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు తీజ్ బుట్టలతో చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం గ్రామ పొలిమేరలోని వాగులో తీజ్లను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చౌహన్ నాయక్, జాదవ్ దుదిరాం, రాథోడ్ శేవంతరోహిదాస్, జాదవ్ మీరాప్రకాష్ సేవాలాల్, ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ సింగ్ మహారాజ్, గోగారాం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.