మందమర్రి, జూన్ 30 : కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. నినాదం తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) సింగరేణి పరిరక్ష ణ సదస్సులు నిర్వహిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే బుధవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న సదస్సుకు సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజ యవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సుకు శాసన సభ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొంటారని ఆయన వివరించారు. 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి సంస్థలో తీవ్రమైన రాజకీయ జోక్యం పెరిగిందని, దీని మూలంగా సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. సింగరేణిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణా మాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయ నున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అంటే అబద్ధాలు, అసత్యాలు, దోచుకో.. దాచుకో, కాంగ్రెస్ అంటేనే స్కాములు.. స్కీములు, అవినీతి అక్రమాలని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు సింగరేణి సంస్థ ను నష్టాల పాలు చేసి ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన ప్రైవేటు సంస్థకు కొత్తగూడెంలోని వీకే మైన్‌ను అక్రమంగా కట్టబెట్టేందుకు కుట్ర పన్నడం దుర్మార్గమని మండిపడ్డారు. వీకే మైన్, నైనీ బ్లాక్ కేటాయింపులపై టీబీజీకేఎస్ ఆందోళనలకు సిద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ఆయన గుర్తు చేశారు.
బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆందోళనలతోనే అనేక ఎక్సెస్ టెండర్లు రైద్దె సంస్థకు లబ్ధి చేకూరిందన్నారు. కార్మికుల వేతనాల చెల్లింపు కోసం ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కలు సాధన కోసం టీబీజీకేఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్ర డిఫ్యూటి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు బండారు సూరిబాబు, దాసరి శ్రీనివాస్, బోరిగం వెంకటేశ్, భూపెల్లి కనకయ్య, బర్ల సదానందం, అన్ని గనుల పిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.