శ్రీరాంపూర్, మే 25 : సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులతో కీలక భేటీకానున్నారు. ఇప్పటికే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలొ సెంట్రల్ కమిటీ సభ్యులకు ఆహ్వానాలు అందాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ ప్రతినిధులు హాజరుకానున్నారు. సింగరేణి అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు.
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, సర్కారు సంఘం ఐఎన్టీయూసీలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై చర్చించనున్నారు. రానున్న ఐదేళ్లలో సింగరేణిలో10 గనులు మూతపడనున్నగా, కార్మికులకు ఉద్యోగ భద్రత కరువయ్యే పరిస్థితి ఉన్నది. అలాగే కార్మికులు అదనంగా ఉన్నారంటూ గోల్డెన్ హ్యాండ్ షేక్(స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) ద్వారా యాజమాన్యం కుట్రలు చేస్తున్నందున, కార్మికులను పోరాటాలపై వైపు చైతన్య పరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే టీబీజీకేఎస్ పూర్తి స్థాయి కేంద్ర కమిటీపై చర్చించనున్నారు.