సోన్, మార్చి 3 : స్వర్ణ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలతోపాటు జౌలినాలా కూడా ఉంటుంది. నీరు అధికం అయినప్పుడు జౌలినాలా ద్వారా నీటిని దిగువనకు వదులుతారు. దీని పరిధిలో నిర్మల్, దిలావర్పూర్ మండలాల్లోని వెంగ్వాపేట్, కాల్వ, కాల్వ తాండ, తల్వేద, చిట్యాల్ గ్రామ రైతులు ఈ యాసంగిలో వరిని సాగు చేశారు. దాదాపు 400 మంది రైతులు 1600 ఎకరాలు సాగు చేస్తున్నారు. స్వర్ణ ఎడారిని తలిపిస్తుండడంతో నీరందక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్లో నాట్లు వేయగా.. మరో నెల రోజుల్లో పూత, ఈనే దశకు రానుండడంతో నీరు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును కలిసి రైతులు నీటిని వదిలించాలని విన్నవించారు. వీరు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని విడిపించినా రెండు, మూడు రోజులైనా నీటిధార చివరి వరకు రావడం లేదు. ఇప్పుడే నీరు రాకుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఇబ్బంది అవుతుందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటలు ఎండి దిగుబడి తగ్గితే నష్టాల పాలవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుతోపాటు మూగ జీవాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. తాగుతామంటే నీరు కూడా లేని దుస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నీటిని అధిక మొత్తంలో జౌలినాలా ద్వారా విడుదల చేసి కాపాడాలని కోరుతున్నారు.
నాకున్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశా. ప్రస్తుతం పంట బాగున్నప్పటికీ వాగులో నీరు లేక.. ఉన్న మోటరును గుంత తవ్వి నీటిలో దించాల్సి వస్తున్నది. అయితే పైనుంచి నీటిధార రాకపోవడంతో పంట చేతికొస్తుందో లేదోనని భయంగా ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించగా నీటిని విడుదల చేయించారు. ప్రస్తుతం వాగులో నీరు పూర్తిగా ఎండిపోయింది. పరిస్థితిని అర్థం చేసుకుని నాయకులు, అధికారులు నీటిని విడుదల చేస్తే తమ పంటకు ఢోకా ఉండదు.