కుభీర్ : ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం అంటూ స్వామి వివేకానంద ( Swami Vivekananda ) చేసిన బోధనలు నేటి యువతకు ఎంతో అత్యవసరమైనవని పలువురు వక్తలు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కుభీర్( Kubheer ) లోని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలోని స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కందూరి సాయినాథ్, ఎస్సై కృష్ణారెడ్డి, వక్త వడ్నం నాగేశ్వర్ మాట్లాడుతూ దేశానికి దిశా నిర్దేశం చేయగలిగే శక్తి కేవలం యువతలోనే ఉందని నమ్మిన స్వామి వివేకానందుడు ఎక్కువ బోధనలు యువజనుల కోసం చేశారని పేర్కొన్నారు. పట్టుదలను నిర్వీర్యం చేయకండి. నిర్భయంగా ముందుకు సాగండి. విజయం దానంతట అదే వరిస్తుందoటూ వివేకుడి బోధనలు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తు చేశారు. అన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సద్గుణాలను అలవర్చుకోవాలన్నారు. చొండి, సోనారి గ్రామాలలో వివేకానందుడి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, నాయకులు ఏషాల దత్తాత్రేయ, ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ, పడిపెల్లి గంగాధర్, యువజన సంఘం సభ్యులు, చోండి, సోనారి సర్పంచులు క్రాంతి బాయి, నర్సింహా, మల్లారెడ్డి, ఈర్ల హనుమాండ్లు, తదితరులు పాల్గొన్నారు.