మంచిర్యాల, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో పని చేస్తున్న కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ డిజిటల్ మిషన్‌లో భాగంగా అన్ని రాష్ర్టాల్లో క్రాప్ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. పక్క రాష్ర్టాలు కేంద్రం ఇచ్చిన నిధులతో ప్రత్యేక ఏజెన్సీలు, ఇతర శాఖల సాయంతో సర్వే చేయిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆ పనిని ఏఈవోలతో చేయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 49 రకాల పనులు చేస్తున్న తాము ఈ డిజిటల్ సర్వేను చేయలేమని, పనిభారాన్ని అర్థం చేసుకోవాలని ఏఈవోలు ప్రభుత్వానికి చెప్పుకుంటూ వచ్చారు. సర్వే చేయడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లనైనా నియమించాలని వినతిపత్రాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసిస్టెంట్లను నియమించే సర్వే చేస్తున్నందున తమకు ఈ సదుపాయం కల్పించాలని మొరపెట్టుకున్నారు.
ఏఈవోలపై ఎందుకంత కాఠిన్యం..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించేందుకు మా నెత్తిన సర్వేను రుద్దాలని చూస్తున్నదని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. సర్వే చేయలేదని కక్షతో రైతు మరణాల నమోదులో అలసత్వం ప్రదర్శించారనే కారణాన్ని చూపి కొందరు ఏఈవోలను సస్పెండ్ చేసిందని మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఐదుగురు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, జిల్లా అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. సస్పెండ్ చేశాం కానీ ఆ వివరాలు చెప్పలేమంటూ దాటవేస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏఈవోల సస్పెన్షన్‌పై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. మా కష్టాన్ని గుర్తించి అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మా విషయంలో ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఏఈవోలు వాపోతున్నారు.
ఒక్కొక్కరి పరిధిలో వేలాది ఎకరాలు..
గతంలో బీఆర్ఎస్ సర్కారు ఐదువేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించింది. 1500 కొత్త ఏఈవో పోస్టులను సృష్టించి, 2601 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 307 మంది ఏఈవోలు ఉన్నారు. కాగా, సగటున ఒక్కో ఏఈవో పరిధిలో 6 వేల ఎకరాల నుంచి 12 వేల ఎకరాలున్నాయి. కొందరికైతే 18 వేల ఎకరాల వరకు ఉన్నాయి. ఈ మే రకు ఒక్కో అధికారి అన్ని వేల ఎకరాలు సర్వే చేయ డం, క్రాప్ వివరాలు ఆన్లైన్ చేయడంతో పాటు అక్కడే ఫొటో దిగి అప్లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఏఈవోలు ప్ర శ్నిస్తునారు. ఇప్పటికే ఉన్న పనితో సతమతమవుతున్నామని వాపోతున్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వంగానే ఏఈవోలను సస్పెండ్ చేసిన ప్రభుత్వంపై సమరానికి సిద్ధం అవుతున్నామని తెలిపారు. సస్పెన్షన్లకు నిరసగా నేడు(బుధవారం) మాస్ లీవ్‌కు జిల్లాలోని ఏఈవోలు పి లుపునిచ్చారు. సస్పెండ్ చేసిన ఏఈవోలను బేషరతుగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, డిజిటల్ స ర్వే చేసేందుకు అసిస్టెంట్లను ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యేక ఏజెన్సీకి ఆ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి ఉద్యమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.
ఏఈవోలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. అప్పటి వరకు మాస్ లీవ్‌లు కొనసాగుతాయి. గ్రామానికో అసిస్టెంట్‌ను ఏర్పాటు చేస్తేనే డిజిటల్ సర్వే చేస్తాం. కక్షపూరితంగా చేసిన సస్పెన్షన్లను ఎత్తి వేసే వరకు నిరసనలు, మాస్ లీవ్‌లు కొనసాగిస్తాం. త్వరలోనే మా తదుపరి కార్యచరణ ప్రకటిస్తాం.
-మేడ రాజ్‌కుమార్, టీఎస్ఏఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఏఈవోల వివరాలు..
జిల్లా : ఏఈవోల సంఖ్య
ఆదిలాబాద్ : 103
నిర్మల్ : 79
ఆసిఫాబాద్: 70
మంచిర్యాల: 55
మొత్తం : 307