నిర్మల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమం గా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఉద యం 8 గంటల నుంచే సుర్రుమంటున్న ఎండ సాయంత్రం 6 గంటలు దాటినా తన ప్రభావా న్ని చూపుతున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలా గే నిర్మల్లో 41.6, భైంసాలో 41.3 డిగ్రీల టెం పరేచర్ ఉంది.
ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.6 డిగ్రీలు నమోదవుతుండగా.. రా త్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పైగా ఉంటున్నా యి. ఈనెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. గత నెల రోజుల్లో సగటున 1.44 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు తగ్గిపోయాయి. గత జనవరిలో జిల్లా వ్యాప్తంగా సగటున 6.32 మీటర్ల లోతులో భూగర్భ జలా లు ఉండగా.. ఫిబ్రవరి నాటికి 7.43 మీటర్లకు చేరాయి. అలాగే మార్చి నాటికి 8.87 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే నీటి వనరుల కొరతతో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది.
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 15 : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయి కంటే 1.5 డిగ్రీల నుంచి 3.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నారు. కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.