మంచిర్యాల అర్బన్, మార్చి 3 : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆర్థిక పునరావాస పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి సబ్సిడీపై రుణాలు అందిస్తూ ఉపాధికి భరోసానిస్తున్నది. వ్యాపారాలు నెలకొల్పిన వారికి అర్హతను బట్టి నిధులు అందించేలా చర్యలు తీసుకుంటున్నది.
ఉమ్మడి జిల్లాకు 94 యూనిట్లు…
2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాలు చేసుకోవాలనుకునే దివ్యాంగులు రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 94 యూనిట్లు మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాయితీపై రూ. 57 లక్షలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.50 వేల విలువైన రుణానికి 100 శాతం రాయితీ ఇస్తుండగా, రూ.లక్ష రుణాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరు చేస్తున్నది. ఇందులో రూ.20 వేలు బ్యాంకు రుణం, మిగిలిన రూ. 80 వేలు దివ్యాంగుల శాఖ ద్వారా రాయితీ కింద మంజూరు చేస్తారు. రూ.2 లక్షల వరకు ఒక యూనిట్‌ను కేటాయించగా, ఇందులో 70 శాతం రాయితీపోను 30 శాతం బ్యాంకు లింకేజీ ద్వారా రుణం అందించనున్నారు. రూ.10 లక్షల వరకు ఒక యూనిట్‌ను మంజూరు చేయగా, రూ.5 లక్షల వరకు రాయితీపోను మిగిలిన సొమ్మును బ్యాంకు రుణంగా మంజూరు చేయనున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఒక మున్సిపాలిటీ, 18 మండలాలు ఉండగా, దివ్యాంగులకు 22 యూనిట్లు కేటాయించి రూ.13.50 లక్షలు మంజూరు చేసింది. అలాగే కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ, 15 మండలాలకు 19 యూనిట్లకుగాను రూ.12 లక్షలు, నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, 19 మండలాలకు 25 యూనిట్లకుగాను రూ.15 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, 18 మండలాలకు 28 యూనిట్లకుగాను దివ్యాంగుల కోసం ప్రభుత్వం రూ.16.50 లక్షలు మంజూరు చేసింది. ఇలా ఉమ్మడి జిల్లాలో 94 యూనిట్లకుగాను రూ.57 లక్షలు అందించనున్నది.
ఏ పనీ చేయలేని దివ్యాంగుల కోసం ఆర్థిక పునరావాసం పథకం కింద ప్రభుత్వం రుణం మంజూరు చేస్తున్నది. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 6వ తేదీ సాయంత్రంలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి పథకాలను పొంది ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవాలి. పెంచిన గడువులోగా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సబ్సిడీని పొందాలి.
– చిన్నయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మంచిర్యాల