కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ సిర్పూర్(టీ), సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టగా, అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇళ్లకు పంపించి వేశారు. ఇక్కడ సుమారు 450 మంది విద్యార్థులు చదువుతుండగా, మూడు నాలుగు రోజుల క్రితం 30 మందికి పైగా ఒకేసారి జ్వరాల బారిన పడ్డారు. అయితే, అందరినీ ఒకేసారి తరలిస్తే ఏమవుతుందోనని భయపడ్డ పాఠశాల సిబ్బంది.. విడుతల వారీగా పిల్లలను సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించినట్లు తెలుస్తున్నది.
సరిపడా బెడ్లు లేక గురుకుల పాఠశాల నుంచి తెప్పించి మరీ వాటిపైనే విద్యార్థులకు చికిత్స అందించారు. ఇక ఇదిలా ఉంటే సుమారు 100 మందికి జ్వరాలు వచ్చినట్లు తెలుస్తుండగా, గురుకులంలో పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. పూర్తిస్థాయి వైద్యమందించాల్సింది పోయి ఏకంగా పాఠశాలకు సెలవులు ప్రకటించి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిర్పూర్(టీ) సామాజిక దవాఖానలో చికిత్సపొందుతున్న విద్యార్థులను కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మంగళవారం పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఒకేసారి జ్వరాలబారిన పడడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు.. నాలుగు రోజులుగా విద్యార్థులకు జ్వరాలు వస్తున్నా పాఠశాల సిబ్బంది ఏం చేస్తుందని ఆరా తీశారు. కాగా, విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అధికారులు ముందుస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జ్వరాలు వ్యాపిచెందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుధ్య పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే పిల్లలు మంచం పట్టాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.