భైంసా, జూన్ 27 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను పడక్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే చేపట్టి అర్హులైన ప్రతి ఓటరును గుర్తించాలని ఆదేశించారు. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు వారిని గుర్తించి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అంతేగాకుండా ఆర్పీలు, ఆశ వర్కర్లు తప్పనిసరిగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులకు హాజరై అధికారుల సూచనల మేరకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం భైంసా మున్సిపాలిటిలో పలు అభివృద్ధి పనులలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నందున అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. ఇందులో బాసర తహసీల్దార్ పవన్ చంద్ర, భైంసా మున్సిపల్ కమిషనర్ లింగయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుభాష్, ఎంపీడీవో నీరజ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగాధర్, టీఎంసీ దత్తాత్రి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భీంరావు ఉన్నారు.

ప్రతి ఓటరుకు సర్వే ఫారాలు అందించాలి
ఇంద్రవెల్లి, జూన్ 27 ః గ్రామాల్లో బీఎల్వోలు చేపడుతున్న ఓటర్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలని ఉట్నూర్ ఆర్డీవో మోహన్‌సింగ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ సర్వే ఫారాలు కుటుంబాలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉట్నూర్ ఆర్డీవో మోహన్‌సింగ్, మండల తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారాలను ఎలా పురించాలో అనేది ప్రతి ఓటరుకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. తప్పులు లేకుండా ఫారాలను పూరించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికీ ఎస్ఐఆర్ సర్వే ఫారాలు అందించాలన్నారు. పోలింగ్ కేంద్రాలవారీగా విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలు సర్వే ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.