నార్నూర్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ( Intermediate annual exams ) మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్( Ganesh Kumar Jadhav) అధ్యాపకులకు సూచించారు.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తగ్గడానికి గల కారణాల పై అధ్యాపకులను నిలదీశారు. కళాశాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున కష్టపడి చదువుకోవాలని , వంద ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్, ఆర్టీసీ డీఎంతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తానన్నారు. అనంతరం అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా విధిగా కళాశాలకు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మురళి, ప్రిన్సిపాల్ వెంకటకేశవులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే, అధ్యాపకులు ఉదయ్ కుమార్, నరేష్, సుజాత, రచన, అజయ్ కుమార్, వరుణ్ రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.