తాండూర్ : విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని మాదారం ఎస్సై సౌజన్య (SI Soujanya) అన్నారు. తాండూర్ ఐబీలోని శ్రీవాణి నికేతన్ పాఠశాలలో కుమార్ బ్రదర్స్ అకాడమీ ( Kumar Brothers Academy ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్ చెస్ చాంపియన్ షిప్ ( Chess Championship ) పోటీలకు ఎస్సై ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువను పెంచుకోవాలన్నారు. క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలంటే నిరంతర సాధన అవసరమన్నారు. నిత్య సాధనతోనే మంచి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా చెస్ ద్వారా మేధాశక్తి పెంపొందుతుందన్నారు.
పాఠశాల యాజమాన్యం, కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ పోటీలలో ఎం ప్రహర్ష (ప్రథమ బహుమతి), దేవాన్స్ (ద్వితీయ బహుమతి), హరిచరణ్ (తృతీయ బహుమతి) వీటితోపాటు కేటగిరీల ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ ఆర్బిటర్ సమ్మయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, కరస్పాండెంట్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.