నిర్మల్ అర్బన్, నవంబర్ 5 ః నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు ఆయాన్ హుస్సేన్. ఈయన తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. తల్లి బీడీ కార్మికురాలు. పాఠశాల విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు.. మంగళవారం తెల్లవారు జామున తోటి విద్యార్థులతో కలిసి ఆయాన్ హుస్సేన్ ఆడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లాడు. తనకు వణుకు పుడుతుందని పీఈటీకి సమాచారం అందించాడు. వెంటనే మెడికల్ రూంలోకి తీసుకెళ్లారు. పిట్స్ రావడంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయాన్ హుస్సేన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆయాన్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకున్నారు. కొడుకు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ ఉండే తమ కుమారుడు ఒక్కసారిగా మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు అనారోగ్యంగా ఉన్న తమ కుమారుడు మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని వాటిని తీర్చాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు ఆందోళనను సర్ధుమనిగేలా చేశారు. అలాగే విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో పలు సమస్యలు ఉన్నాయని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్డీవో రత్న కల్యాణి అన్నారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఈమెతోపాటు డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ పాఠశాలకు చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడారు. పాఠశాల అద్దె భవనంలో ఉండడంతో బాత్రూంలు సరిగ్గా లేవని ఆటలాడేందుకు గ్రౌండ్ లేదని, ఇరుకైన గదులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిర్మల్ పట్టణంలోని ఎంజేపీలో విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న గురుకులాల డిప్యూటీ సెక్రటరీ తిరుపతి పాఠశాలను సందర్శించారు. వి ద్యార్థులతో మాట్లాడి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటనలో వి ధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఐ దుగురిని పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ స స్పెండ్ చేశారు. ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్, నైట్ వాచ్‌మన్ అరుణ్, నైట్ కేర్ టేకర్ రమేశ్, స్టాఫ్ నర్సు సుజాతతోపాటు పీఈటీ పెంటన్నను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు ఆర్సీవో గోపీచంద్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను పంపిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి మృతికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.