బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్న విద్యాకుసుమం అర్ధాంతరంగా తనువు చాలించింది. ఫుడ్ పాయిజన్‌తో దవాఖాన పాలైన ఆ బాలిక మృత్యువుతో పోరాడుతూ చివరకు ఓడిపోయింది. ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తుందనుకొని ఆశపడ్డ ఆమె తల్లిదండ్రులకు చివరకు దు:ఖమే మిగిలింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఊపిరి వదలగా, స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అధికారుల నిర్లక్ష్యమే నిండుప్రాణాన్ని బలిగొన్నదంటూ ఆయా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే మడావి గంగోత్రి(14) వాంతులు, విరేచనాలు చేసుకుని మృతి చెందింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చూపించి వైద్యుల సూచనల మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. కాగా.. గంగోత్రి పాఠశాల బాత్రూమ్లోనే స్పృహతప్పి పడిపోయి చనిపోయిందని.. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోతే ఆమె మృతి చెందేది కాదంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
– ఈ ఘటన అక్టోబర్ 26, 2024న జరిగింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/వాంకిడి, నవంబర్ 25 : వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత నెల 30న ఫుడ్ పాయిజన్ కాగా, 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కొంత మందిని వాంకిడి పీహెచ్సీ, ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మరికొంత మందిని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలోని ప్రైవేట్ దవాఖానల్లో చేర్పించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారగా, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. నవంబర్ 5న తొమ్మిదో తరగతి చదువుతున్న శైలజతో పా టు ఎనిమిదో తరగతి విద్యార్థిని మహాలక్ష్మిని, ఏడో తరగతి విద్యార్థిని జ్యోతిని నిమ్స్‌లో చేర్పించారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోవడంతో ఈ నెల 14న డిశ్చార్జి చేశారు. కానీ.. శైలజ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
మొదట శైలజ కోలుకుందని చెప్పిన వైద్యులు ఆమెను జనరల్ వార్డుకు తరలించారు. మరుసటి రోజు మళ్లీ విషమించడంతో తిరిగి వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆమె ఆరోగ్యం సహకరించ లేదు. మూడు రోజులుగా కృత్రిమ శ్వాసపై ఉంచి వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి దవాఖానకు వెళ్లి శైలజను పరామర్శించారు. మంత్రులు సీతక్క, దామోదర్ రాజనర్సింహ సైతం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 20 రోజులుగా మృత్యువుతో పోరాడిన శైలజ సోమవారం తుది శ్వాస విడిచింది.
20 రోజులుగా దవాఖానలోనే..
కూతురు శైలజ దుస్థితిని చూసి ఆమె తల్లిదండ్రులు చౌదరి తుకారం, మీరాబాయి ఆందోళన చెందుతూ వచ్చారు. 20 రోజులుగా కంటిమీద కునుకులేకుండా కూతురుతో పాటు దవాఖానలోనే ఉన్నారు. వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన తుకారం దంపతులది వ్యవసాయ కుటుంబం. తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. శైలజ వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో 9 వ తరగతి, కుమారుడు వాంకిడి జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కూతురు శైలజ చదువులో చురుకుగా ఉండేదని, ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్న బిడ్డ చివరికి మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే..
ఆశ్రమ విద్యార్థిని శైలజ ఆరోగ్యంపై అధికారులు ముందు నుంచి సరైన శ్రద్ధతీసుకొనిఉంటే ఇలా జరిగేది కాదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థినులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే బాలిక చనిపోయిందని వారు మండిపడుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఆశ్రమాల్లో మృత్యుఘోష వినిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుండగా, కలకలం రేపుతున్నది.
ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్నం
మా తమ్ముడి కూతురు శైలజ ప్రాణాలతోనే తిరిగి వస్తుందనుకొని ఎంతో ఆశ పడ్డం. హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానలో చేర్పించిన్రు అన్నరు. ఏం కాదనుకున్నం. కానీ చివరికి మా బిడ్డ శవాన్ని అప్పగిస్తరనుకోలేదు. మా బిడ్డ చావుకు అధికారులే బాధ్యత వహించాలి. మా ఇంటికి పెద్దదైన శైలజపై మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. చివరికి మరణవార్త వినాల్సి వచ్చింది.
– వడాయి కన్ను, శైలజ పెద్దనాన్న
శైలజపైనే మాకు ఆశలు ఉండేవి
మా మేన కోడలు శైలజ చదువులో చురుకుగా ఉండేది. శైలజ తండ్రి తుకారం తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తు న్నాడు. శైలజ ఉన్నత చదువులు చదువుకొని తప్పకుండా మంచి స్థాయికి వెళ్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ చివరికి ఇలా అయ్యింది. ఆమె చనిపోతుందని అస్సలు అనుకోలేదు.
– నాందేవ్, శైలజ మేనమామ