తాండూర్ : జిల్లాలోని పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై ( Sanitation) నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు (DPO Venkateswar Rao ) హెచ్చరించారు. మండలంలోని రెచిని, గోపాల్ నగర్, తాండూర్ గ్రామ పంచాయతీలను డీపీవో ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కాలనీల్లో పర్యటించి పారిశుధ్యపనుల నిర్వహణను పరిశీలించారు.
తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన పలు వీధుల్లో పేరుకుపోయిన చెత్త అపరిశుభ్రమైన వాతావరణాన్ని గమనించి పంచాయతీ కార్యదర్శి దొండ దివాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో క్లోరినేషన్ ( Chlorination) పనులు చేపట్టాలని, మురుకి కాలువలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారఉ. పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని ఆదేశించారు.
చెత్తను బయట వేసే దుకాణదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని, పలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డుల స్థాయి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, గ్రామపంచాయతీ అవార్డ్స్ డేటాను పరిశీలించారు. డీపీవో వెంట ఎంపీవో అనిల్ కుమార్, కార్యదర్శులు దివాకర్, శ్రీనివాస్, లక్ష్మణ్, పంచాయతీ కంప్యూటర్ అపరేటర్లు కుమారస్వామి, కిషోర్ ఉన్నారు.