భైంసా టౌన్ : గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ (Faizan Ahmed) అన్నారు. సోమవారం మండలంలోని పెండ్ పల్లి గ్రామంలో స్పెషల్ సానిటైజేషన్ డ్రైవ్ (Special sanitization drive) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు.
గ్రామంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. నల్లాలు,పైప్ లైన్ లీకేజీల వల్ల ఏర్పడుతున్న నీటి వృధాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. వచ్చే శనివారం గ్రామాన్ని సందర్శించే లోపు లైబ్రరీ, విద్యుత్, లీకేజీ, పారిశుద్ధ్యం సమస్యలు ఉండకూడదన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.
పాఠశాలలో విద్యార్థులతోపాటు నేలపై కూర్చుని ఉపాధ్యాయుడు గోపాల్ చెప్పిన పాఠాలను విని విద్యార్థులకు పలు ప్రశ్నలను అడిగి సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. బోధన సామాగ్రి తో విద్య బోధనను మెచ్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట డీఎల్పీవో సుదర్శన్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో మోసం హుస్సేన్, మాజీ సర్పంచ్ రాజేందర్, కార్యదర్శి కవిత, ఏపీవో శివలింగం తదితరులు ఉన్నారు.