తాండూర్: ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తంగళ్ళపల్లి గ్రామ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ ఏర్పాటుకు తహసీల్దార్ జ్యోత్స్న తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనంతరం తాండూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనానికి ( Ganesh Immersion ) పెద్ద చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
వినాయక శోభాయాత్ర అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. నిమజ్జనం ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండళ్ల నిర్వాహకులు మార్గదర్శకాలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.