‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నది. వ్యవసాయం, ఐటీ రంగాల్లో ముందంజలో ఉంది.’ అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆదిలాబాద్, ఉట్నూర్ పట్టణాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో మంత్రి ప్రసంగించారు. నాలుగు జిల్లాల్లో మెడికల్, ఆదిలాబాద్‌లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు కలను సీఎం కేసీఆర్ నిజం చేసి రైతుల మోములో సంతోషాన్ని నింపారన్నారు. తెలంగాణలో సెక్యూలర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని పేర్కొన్నారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితంగా అభివృద్ధి ఖిల్లాగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉట్నూర్, ఆదిలాబాద్ పట్టణాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉందని, ఉద్యమ సమయంలో సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో తెలంగాణ వచ్చేంత వరకు దీక్షా శిబిరాలు కొనసాగాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితంగా జిల్లా వ్యవసాయం, ఐటీతోపాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పది సీట్లలో ఘన విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మెడికల్ కళాశాలలు, ఆదిలాబాద్‌లో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోయర్ పెనగంగ ప్రాజెక్టు జిల్లా రైతుల చిరకాల వాంఛ అని, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నాయకులు ప్రాజెక్టు నిర్మిస్తామని రైతులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేసి రైతుల్లో సంతోషాన్ని నింపారన్నారు. ప్రాజెక్టు బరాజ్, పంప్‌హౌస్, కాలువల పనులు పూర్తికాగా ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. అందరికీ ప్రయోజనం చేకూర్చే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కా ర్యకర్తలు కష్టపడి ప్రతి ఇంటికి తీసుకుపోయి వివరించాలని కోరారు. ఇటీవల ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సీసీఐ స్క్రాప్‌ను అమ్మకానికి పెట్టిందని ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని, డిపాజిట్ రాకుండా చూడాలని కోరారు. ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న నిఖార్సాయిన ఉద్యమకారుడు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేశాడని, పది సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో సెక్యూలర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మంత్రి పేర్కొన్నారు. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని, రెండు పార్టీలకు అంతర్గతంగా ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ వాళ్లు బీజేపీకీ ఓటు వేశారని తెలిపారు. బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్‌లో కలుస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని తెలిపారు. జిల్లాలో బీజేపీ నాయకులను మహారాష్ట్రకు తీసుకుపోయి అక్కడి అభివృద్ధి ఎలా ఉందో చూపించాలని సూచించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1200 చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే రూ.400 లకు తగ్గిస్తామన్నారు. రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంచుతామని, ఆసరా పింఛన్లు నెలకు రూ.5 వేలు అందజేస్తామని తెలిపారు. పేదలకు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, మహిళలకు సౌభాగ్యలక్ష్మీ పథకంలో భాగంగా నెలకు రూ.3 వేలు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 15 లక్షలు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ అధికారంలో వచ్చి కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఖానాపూర్ ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, బీఆర్ఎస్, జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలతో సభా ప్రాంగణాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎంపీ నగేశ్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస్, నాయకులు సాజొద్దీన్, లింగారెడ్డి, అలాల అజయ్ పాల్గొన్నారు.