మంచిర్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమానికి నిధులివ్వకపోవడం అధికారులను అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా, పైసల్లేకుండా పనులెట్లా చేసేదని వారు తలలు పట్టుకుంటున్నారు.
జనవరితో సర్పంచ్ల పదవీకాలం పూర్తికాగా, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం విదితమే. కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో పరిపాలన గాడి తప్పి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ భారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపైనే మోపడంతో ఏం చేయాలో తెలియక వారు సతమతమవుతున్నారు.
జిల్లా నుంచి మొదలుకొని.. మండల స్థాయి అధికారులు వరకు ప్రతి పని పంచాయతీ కార్యదర్శులకే అప్పగించడంతో ఎటూ పాలుపోలేని దుస్థితి నెలకొంది. గత కేసీఆర్ సర్కారు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ముందస్తుగానే నిధులు విడుదల చేయడంతో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా సక్రమంగా నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండగా, కార్యక్రమాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
పడకేసిన పారిశుధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిపప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. పంచాయతీలకు ఏడు నెలలుగా ఒక్క రూపాయి కూడా రావడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి, వాటిని పంచాయతీ కార్మికుల వేతనాలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ నిధులు వారి వేతనాలకే సరిపోయాయి.
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో పైసలు లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. పెద్ద జీపీలు ఎలాగో నెట్టుకువస్తున్నా, చిన్న పంచాయతీల్లో మాత్రం సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టకపోవడంతో, కార్యదర్శులకు బ్యాంక్‌ల నుంచి నోటీసులు వస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజూ చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోయించేవారు లేక అవి మూలన పడ్డాయి.
కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అప్పులు చేసి కొన్ని నెలలు వాటిని నడిపించగా, ఆ అప్పులు కుప్పలై మళ్లీ అప్పు పుట్టకపోవడంతో వారు కూడా చేతులెత్తాశారు. దీంతో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు ముందుకు సాగగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంచాయతీలు అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారుతున్నాయి.
జీతాలు పంచాయతీలకే
కార్యదర్శులు వారి జీతాలను గ్రామ పంచాయతీలకే వెచ్చిస్తున్నారు. పైగా అప్పులు కూడా చేయాల్సి వస్తోంది. ప్రతి పనికీ పంచాయతీ కార్యదర్శులనే బాధ్యున్ని చేయడం, ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకుండా పనులు చేయమనడం, దీనికి తోడు జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా పంచాయతీ కార్యదర్శులపైనే భారం వేయడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది.
ఇప్పటి వరకు పంచాయతీలకు ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రతి నెలా తమ జీతంతో పాటు అదనంగా మరో రూ. 20 వేల నుంచి రూ. 30 వేల దాకా అప్పులు తెచ్చి పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ సరిపోనట్లు తాజాగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరిట మరో పెనుభారం మోపుతుండడంతో ఈ కార్యక్రమాన్ని నిధులు లేకుండా ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతిదానికి నిధులు అవసరం ఉండగా తమకు అప్పులు ఎవరు ఇస్తారని, ఇలా అప్పులు చేస్తూ పోతే తమ జీవనం ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.