ఎదులాపురం, డిసెంబర్ 8 : ఈ నెలాఖరు నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఊరు మన బడి లో ముందుగా నిర్ణయించిన పనులు ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ త్వరలో పనులు పూర్తి చేసి పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని తెలిపారు. మన ఊరు -మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలో చేపట్టిన 237 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారి నర్సయ్య, నారాయణ, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ ,సాంఘిక సంక్షేమ శాఖల ఈఈలు పాల్గొన్నారు.