మంచిర్యాల, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ పట్టణానికి చెందిన ఎల్పుల రాజక్క-లచ్చయ్య దంపతుల కుమారుడు ఎల్పుల పోచం తను నేర్చుకున్న కళను విశ్వవ్యాప్తం చేసేందుకు లైవ్ డ్రాయింగ్ పేరిట దేశవ్యాప్త యాత్ర చేపట్టాడు. 2017 డిసెంబర్లో మొదలైన ఆయన ప్రయాణం నేడు కన్యాకుమారిలో ముగియనున్నది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా 28 రాష్ర్టాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టివచ్చిన ఆ కళాకారుడిపై ప్రత్యేక కథనం.. ఎల్పుల పోచం చెన్నూర్‌లో ఇంటర్ వరకు చదువుకున్నాడు.
ఆపై హైదరాబాద్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాడు. చిత్రకళా రంగంలో చేయి తిరిగిన పోచం తన కళకు దేశావ్యాప్త గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్యం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయవచ్చనే సంకల్పంతో 2017 డిసెంబర్లో వారణాసిలో పూజలు చేసిన కశ్మీర్ నుంచి తన లైవ్ డ్రా యింగ్ కళాయాత్ర ప్రారంభించాడు. విద్యార్థులకు చిత్రలేఖనం, ట్యూషన్లు చెప్పి అలా వచ్చిన డబ్బుతో యాత్రను కొనసాగించాడు.
ఇలా చేస్తూ పోతే దేశం మొత్తం తిరగడం చాలా సమయం పడుతుందని భావించి స్నేహితులు, గురువుల సహకారంతో ఒక్కో రాష్ట్రం తిరుగుతూ ఆ రాష్ట్ర చరిత్ర, సందర్శనీయ ప్రదేశాలను సందర్శిస్తూ వాటి చిత్రాలు గీస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళ్లిన చోట ఆ ఊరిలోని గుడి, బడి, మసీదులలో ఆశ్రయం పొందాడు. స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ సుదీర్ఘ యాత్ర పూర్తి చేస్తున్నాడు.
2017లో మొదలు పెట్టిన యాత్ర 2410 రోజుల పాటు కొనసాగగా, తన యాత్రలో 30700 కిలోమీటర్లు పూర్తి చేశాడు. 28 రాష్ర్టాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించిన పోచం ఆ ప్రాంతంలోని స్మారక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు, సంస్తృతి, సంప్రదాయాలను తన చిత్రాల ద్వారా బంధించారు. దేశంలోని ఎనిమిది జ్యోతిర్లింగాలు, తొమ్మిది అష్టశక్తి పీఠాలు, 24 సెంట్రల్ యూనివర్సిటీలు, ఫైన్ ఆర్ట్స్ కళాశాలలను సందర్శించారు. ఇలా సందర్శించిన ప్రతి ప్రాంతంలోని చిత్రాలను గీచిన పోచన్న నేటి వరకు తన యాత్రలో 14 వేలకు పైగా లైవ్ పెయింటిగ్స్ వేశాడు. దూర ప్రాంతాలకు ట్రైన్ ద్వారానే ప్రయాణం చేసిన పోచం, ఆయా గ్రామాలను చుట్టి రావడానికి సైకిల్‌ను ఉపయోగించడం విశేషం.
పోచన్న ఎవరికీ సాధ్యంకాని యాత్రను పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఆర్థికంగా లేకపోయినప్పటికీ తన గురువు సత్యనారాయణ, మద్దూరి రాజన్న-సుజాత సహకారంతో తన యాత్రను ప్రారంభించాడు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్విరామంగా కష్టపడుతూ ముందుకు సాగాడు. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా ముందుకెళ్లిన ఆయన, నేడు కన్యాకుమారిలో ఈ యాత్రను ముగించనుండడం విశేషం. తన యాత్రకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ప్రేస్టీజియస్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్‌లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.