కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్ల( Soya Tokens ) జారీలో తోపులాట( Stampede) జరిగి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం నుంచి సోయా పంట కొనుగోళ్లకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో రాత్రి రెండు గంటల నుంచి మండలంలోని ఆయా గ్రామాల రైతులు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఆయా గ్రామాల రైతులు వేలాదిగా చేరుకోవడంతో ప్రాంగణమంతా రైతులతో కిక్కిరిసిపోయింది.


కుభీర్- భైంసా రహదారి ఇరువైపులా ద్విచక్ర వాహనాలతో అర కిలోమీటర్ మేర నిండిపోయింది. క్యూలైన్లలో గంటల తరబడి రాత్రంతా వేచి ఉన్న రైతులకు తోడు మహిళా రైతులు ఉదయం నుంచి బారులు తీరడంతో క్యూలైన్లలో తోపులాటలు ప్రారంభమయ్యాయి. తోపులాటలో కిందపడిన రైతులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా రైతులకు ప్యాక్చర్ కాగా మరో 8 మంది వరకు రైతులు గాయపడ్డారు. వందలాదిమంది రైతులు క్యూ లైన్లలో నిలబడ లేక వెనుతిరిగి వెళ్లిపోయారు.కాళ్లు విరిగిన ఇద్దరు మహిళా రైతులను భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ అక్కడికి చేరుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు తీసుకొచ్చిన ఆధార్, పట్టా, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను ముందుగా కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత టోకెన్లు జారీ చేయాలని ఆదేశించడంతో మైకు ద్వారా రైతుల పేర్లను అనౌన్స్ చేసి టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగించారు.