కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : అడవులను రక్షించాల్సిన అటవీశాఖ అధికారులే గిరిజనేతరులకు సహకరిస్తూ.. పోడు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది. చింతలమానేపల్లి మండలం దిందా, బండెపల్లి, ఖర్జెల్లి అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల అడవులను నరికి పోడు సాగు చేస్తున్నారన్న ఘటనలపై ఇటీవల ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టగా, విస్తుపోయే నిజాలు వెలుగుచూడడం ఆందోళనకు గురిచేస్తున్నది.స్వయంగా ఖర్జెల్లి అటవీ సెక్షన్ అధికారి అజ్మీర మోహన్ పోడు సాగుకు సహకరించినట్లు గుర్తించి.. ఆ వెంటనే సస్పెండ్ చేయగా, అనేక ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది.
టైగర్ కన్జర్వేషన్‌గా మారడంతో..
జిల్లా సరిహద్దులోని ప్రాణహిత నదిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూరు, దహెగాం, పెం చికల్పేట్ మండలాలకు సరిహద్దున ప్రాణహిత న ది ప్రవహిస్తుండంతో ఆ ప్రాంతంలో సహజమైన, దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల కారణంగానే ఆసిఫాబాద్‌కు అడవుల ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. ప్రాణహిత నదికి అవతల మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం ఉంది.
ఇది పులుల అభయారణ్యం. ప్రాణహితకు అవతల తడోబా పులుల సంరక్షణ కేంద్రం ఉండడం.. ప్రాణహితకు ఇవతల దట్టమైన అడవులు ఉండడంతో పులులు అక్కడి నుంచి ప్రాణహితను దాటుకొని కాగజ్‌నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పులులు ఇక్కడి అడవుల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. దాదాపు పదేళ్లుగా పులుల రాకపోకలు పెరుగడంతో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఇటీవల టైగర్ కన్జర్వేషన్‌గా ప్రకటించింది.
ఈ క్రమంలో కాగజ్‌నగర్ అడవి డివిజన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన అధికారులు ఇక్కడి అడవులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎకరాల కొద్ది అటవీ భూములను ఆక్రమించిన వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది ఎకరాల్లోని అటవీ భూములను ఎవరి సహకారంతో నరికారనే దానిపై విచారణ చేపడుతుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
అటవీ భూములన్నీ గిరిజనేతరుల చేతుల్లోనే…
జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్లో అటవీ భూములు అధికంగా గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయి. సిర్పూర్ టీ మండలం చీలపల్లి, ఆరెగూడ, భూపాలపట్నం, లక్ష్మీపూర్, హీరాపూర్, ఇటుకలపహాడ్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల పరిధిలో గిరిజనేతరుల చేతిలో వేలాది ఎకరాల అటవీ భూములు ఉన్నాయి.
చింతలమానేపల్లి మండలం పరిధిలోని దిందా, బండెపల్లి, కోర్సిని, అడెపల్లి, గూడెం, శివపల్లి, కోయపల్లి, గంగాపూర్ గ్రామాల పరిధిలో, బెజ్జూర్ మండల పరిధిలోని కుకుడ, పాపన్‌పేట్, పెంచికల్పేట్ మండల పరిధిలోని కొండపల్లి, లోడ్పల్లి, జైహింద్‌పూర్, అగర్‌గూడ, దరోగపల్లి, బొంబాయిగూడ, రస్పల్లి, బాబాసాగర్, దహెగాం మండలం హత్తిని, ఐనం, రాంపూర్ తదితర ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం పది ఎకరాలకు పైగానే ఆక్రమించుకున్నట్లు తెలుస్తుంది. అటవీ అధికారులు సహకారం వల్లే అడవుల ఆక్రమణకు హద్దులు లేకుండా పోతున్నట్లు ఆరోపణలున్నాయి.
గతంలోనూ అనేక మంది అధికారులపై వేటు..
గతంలో అడవుల నరికివేతకు.. కలప అక్రమ రవాణాకు సహకరించిన అనేక మంది అటవీ అధికారులపై వేటు పడింది. కెరమెరి మండలం జోడేఘాట్, లింగాపూర్, వాంకిడి, కెరమెరి మండలాల్లో జరిగిన పలు ఘటనల్లో అధికారులపై అంతర్గతంగా జరిపిన విచారణల్లో అనేక నిజాలు వెలుగుచూశాయి. అక్రమాలకు పాల్పడిన అనేక మంది అధికారులను సస్పెండ్ చేశారు. లింగాపూర్, జోడేఘాట్ అటవీ ప్రాంతాల్లో నేరుగా అటవీ అధికారులే స్మగ్లర్లతో చేతులు కలిపి కలపను అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి.
తాజాగా.. అడవుల నరికివేతకు సహకరించిన ఖర్జెల్లి ఎఫ్ ఎస్వోను జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రివాల్ సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మరికొంతమంది అధికారులపైనా వేటు పడే అవకాశమున్నది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో గిరిజనేతరులు వేలాది ఎకరాల అటవీ భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. గిరిజనుల పేరుతో గిరిజనేతరులు అడవులను అక్రమిస్తున్నారు. గిరిజనేతరులకు అటవీ అధికారులే సహకరిస్తుండడంతో వేలాది ఎకరాల అడవులు అంతరిస్తున్నాయి.