కౌటాల, నవంబర్ 30 : మండల కేంద్రంలో కొలువైన స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర అమ్మవారి జాతరకు వేళయ్యింది. యేటా కార్తీక మాసం చివరి ఆదివారం కంకలమ్మ అమ్మవారి మహాజాతర ఉత్సవాలు నిర్వహిస్తుండగా, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవారి ఆలయానికి 6 కిలో మీటర్ల దూరంలో వార్దా, 13 కిలోమీటర్ల దూరంలోప్రాణహిత నదులు ఉండగా, భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి.. ఆపై అమ్మవారికి పూజలు చేస్తారు. నేడు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వ్యవస్థాపకుడు సులువ కనకయ్య తెలిపారు.
కాకతీయుల పాలనకు సాక్ష్యంగా ఆలయం
కంకలమ్మ ఆలయం కాకతీయుల పాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. భారతదేశంలోనే మేదరు(మహేంద్రుల)ల ఆరాధ్య దైవంగా ఉన్న ఏకైక ఆలయం ఇది. వందల ఏళ్ల క్రితం డంగుసున్నంతో భారీ రాతి దిమ్మెలతో ఆలయాన్ని నిర్మించినట్లు అవగతమవుతున్నది. మధ్య యుగంలో ఇక్కడి దేవాలయాలు, విగ్రహాలను కొందరు ముష్కరులు ధ్వంసం చేసినట్లుగా పూర్వీకులు చెబుతారు. కౌటాల క్షేత్రంలో అక్కడక్కడా పొలాల గట్ల పైన వినాయకుడు, కుమారస్వామి, నంది, శృంగి, భృంగి, బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతల విగ్ర హాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. గుట్టపై ఆలయం ముందు పెద్ద నీటి కొలను ఉంది.
ఆలయ పునర్నిర్మాణం
కాగజ్నగర్ పట్టణానికి చెందిన సుల్వ కనకయ్య- కల్యాణి దంపతుల సాయంతో శ్రీ కంకలమ్మ కేతేశ్వర ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. 17-03-2008 సోమవారం రోజున వేదపండితులు మహా గణపతి, నవగ్రహ రుద్రహోమములు నిర్వహించి పనులు ప్రారంభించారు. 13-11-2009న వేద పండితుల మంత్రోచ్ఛర ణల మధ్య కంకలమ్మ దేవి, కేతేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ధ్వజ స్తంభములు, నవగ్రహాలు, నాగదేవత విగ్రహాలకు ప్రతిష్ఠాపన చేశారు.