నార్నూర్, జనవరి 8 : పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి గతంలో పలు కార్యక్రమాలు అమలు చేసింది. 2017లో త్రీఆర్స్, 2018లో ఏబీసీ పేరుతో విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేసింది. పర్యవేక్షణ లోపం, సమీక్షలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అనంతరం రెండేళ్ల పాటు కరోనాతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. దీంతో మళ్లీ తొలిమెట్టు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది విద్యార్థుల భవితకు ఎంతో దోహదపడనుంది. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని పాఠశాలలో ఐదు రోజుల పాటు బోధన, ఒక రోజు మూల్యాంకనం చేపడుతూ విద్యార్థుల సామ ర్థ్యాన్ని ఉపాధ్యాయులు అంచనా వేస్తూ ముందుకు సాగుతోంది.
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రణాళికబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల వ్యాప్తంగా 57ప్రైమరీ పాఠశాలలు ఉండగా అందులో 1,998 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
వారంలో ఆరు పని దినాల్లో ఐదు రోజులు విద్యార్థుల బోధన, ఒకరోజు మూల్యాంకనంతో సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. వారానికి ఓసారి మూల్యాంకనంతో పాటు ప్రతి నెలకోసారి పరీక్ష నిర్వహించి, వారి ప్రగతిని రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి నెల 27వ తేదీన పాఠశాలలో తొలిమెట్టు అమలు, అభ్యసన ఫలితాల సాధనలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించాల్సి ఉంటుంది. 28న మండల, 29న జిల్లా స్థాయిలో సమీక్షలు జరగనున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు మండలానికి ఓ నోడల్ అధికారిని నియమించారు. డీఈవో, ఎంఈవో, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను సందర్శించి తొలిమెట్టు అమలును ఉన్నతాధికారులు తెలుసుకునేందుకు ఓ యాప్ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పాఠశాలల పర్యవేక్షణకు వెళ్లిన నోడల్ అధికారులు తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల పరీక్షలు, వారి సామర్థ్యాలను ఈ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతం కంటే ప్రస్తుతం తొలిమెట్టులో విద్యార్థులకు ఆర్థవంతమైన బోధన జరుగుతుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని తొలిమెట్టు కార్యక్రమం ఆయా పాఠశాలల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఐదు రోజుల పాటు బోధన చేపట్టి, ఒక రోజు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా ప్రణాళికబద్ధంగా బోధన వ్యూహాలను రూపొందించి తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నాం.
-కోట్నాక్ రాజేశ్వర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు,ఝరి, గాదిగూడ మండలం
ఉపాధ్యాయుల ఆలోచన విధానం, అన్వేషణ, పోటీతత్వంలో తొలిమెట్టు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులకు అర్థవంతమైన బోధనను అందిస్తుండడ ంతో సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. చిన్నారులకు విషయ పరిజ్ఞానం అలవాటు పడి, చదివిన పాఠ్యాంశాలపై పట్టు సాధించడానికి ఎంతో వీలు కలుగుతోంది. కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి మండలంలో తొలిమెట్టు కార్యక్రమం ముందుకు సాగుతోంది.
-రాపెల్లి ఆశన్న, ఎంఈవో, ఉమ్మడి మండలం