కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ అనుమతులు లేక మారుమూల గ్రామాలకు నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలకు త్వరలో మోక్షం కలగనుండగా, అడవిబిడ్డల దశాబ్దాల కల నెరవేరే అవకాశమున్నది. జిల్లాలోని మారుమూల గ్రామాలకు 24 రోడ్లు మంజూరు కాగా, కొన్ని అటవీ శాఖ అనుతులు లేక.. మరికొన్ని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ విషయమై సోమవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చ ర్చించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ ల ఆధ్వర్యంలో సాగుతున్న దాదాపు 24 రోడ్ల పనులు త్వరలో పూర్తిచేసేలా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన 12 రోడ్ల ని ర్మాణాలకు అటవీశాఖ అనుమతి లేక పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి అనుమతి రావాల్సి ఉందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ తెలిపారు. వీటిలో దాదాపు 11 పనులు కాంట్రాక్టర్ల వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఒక పని రాష్ట్ర కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన 7 రోడ్లకుగాను 5 రోడ్లు కాంట్రాక్టర్ల వద్ద, 2 పనులు మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఐటీడీఏ ద్వారా గిరిజన గ్రామాలకు చేపట్టిన 5 రోడ్లు కాంట్రాక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 6 జియో సెల్ టవర్ల నిర్మాణాలు 6 చేపట్టగా, వీటిలో 5 కాంట్రాక్టర్ల వద్ద, ఒకటి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని తెలిపారు.
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రోడ్లు, వివిధ రకాల అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చేందుకు అటవీ శాఖ సిద్ధంగా ఉందని, అయితే ఆయా శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తులు సరైన విధంగా ఉంటే వెంటనే ఇచ్చేందుకు వీలుకలుగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. అటవీ ప్రాంతంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు కావాల్సిన అనుమతులను పనులు ప్రారంభించేకంటే ముందే టెండర్ల దశలోనే తీసుకోవాలని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు ఈ విషయం తెలిసి కూడా పనులు ప్రారంభిస్తున్నారని, దీంతోనే అటవీ చిక్కులు వస్తున్నాయని, అటవీ శాఖలను దోషిగా ప్రజల ముందు ఉంచుతున్నారని అన్నారు.
అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న పనులకు సంబంధించి అనుమతుల కోసం త్వరతగతిన దరఖాస్తులు పంపాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనులు ప్రారంభించిన తర్వాత.. మధ్యలోనే ఆగిపోతే ప్రజలతో పాటు అధికారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుదన్నారు. అసరమైన చోట్ల తగిన విధంగా ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అన్నారు. మారుమూల గ్రామాలకు ఆగిపోయిన రోడ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా అటవీ, ఆర్అండ్బీ అధికారులు చొరవతీసుకోవాలని అన్నారు.