 
                                                            కాసిపేట : ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ( Special attention ) సారించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) సూచించారు. శుక్రవారం కాసిపేట మండలంలో కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, రేగులగూడ, మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలను ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కస్తూర్భాలో తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు. మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించి ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.
రేగులగూడ, మల్కెపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించి వంటశాలలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా బోధన అందించాలని, పాఠశాలలలో అవసరమైన మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.
ప్రభుత్వం నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ ప్రిన్సిపాల్ ఖలీల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, కార్యదర్శి మేఘన, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.
 
                            