నిర్మల్ చైన్‌గేట్, మే 19 : నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే గోదాములకు తరలించాలన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగినన్ని లారీలు, హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్‌ఫెడ్ మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు పూర్తిగా నిర్మూలించాలి
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశమందిరంలో జిల్లా శ్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలి
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అందుబాటులో లేని రైతుల వివరాలను వివిధ మార్గాల్లో అన్వేషించాలని సూచించారు.