ఎదులాపురం, ఏప్రిల్ 1 : యువత బెట్టింగ్‌లకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ ఆన్లైన్ క్రికెట్ బెట్ ఆన్లైన్ యాప్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేరొన్నారు.
యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. డైట్ మైదానంలో కొందరు యువకులు ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్న సమాచారం రావడంతో సోమవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
కచ్కంటి గ్రామానికి చెందిన జోగు సాయికుమార్, పట్టణానికి చెందిన షేక్ సాజీద్ ఆన్లైన్లో ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ 99 యాప్‌లో బెట్టింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్‌కుమార్, కరుణాకర్, ఎస్సై అశోక్ పాల్గొన్నారు.
నిజాయితీతో విధులు నిర్వర్తించాలి..
నిజాయితీతో విధులు నిర్వర్తించి ప్రజలకు మంచి సేవలను అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బంది, జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని సిబ్బందిని ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా డయల్ 100 సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజించి విధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 10.30 గంటల తర్వాత అనవసరంగా గుంపులు గుంపులుగా తిరిగే వారిపై ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించి వేలిముద్రలను సేకరించాలని సూచించారు. డయల్ 100కు ఫోన్ చేసే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాస్, నాగేందర్, సీఐలు భీమేశ్, గుణవంత రావ్, పాండే రావ్ పాల్గొన్నారు.