Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బందితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారితో శివాజీ చౌక్ నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడానికి, అవాంఛనీయ సంఘటనలో జరిగిన వెంటనే అత్యవసర సమయంలో పోలీసు సిబ్బంది స్పందించే విధంగా సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌లో పోలీసు సిబ్బంది ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటూ ఎలాంటి అవసరమున్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.
బ్యాంకు నందు నిత్యం ప్రజలు నగదు లావాదేవీలు జరిగే పరిస్థితి ఉన్నందున ఎలాంటి నేరాలు జరగకుండా అడ్డుకోవడానికి ఈ కంట్రోల్ రూమ్ సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. తదుపరి బ్యాంకును పరిశీలించి, లాకర్లకు భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అలారం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్సీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, మున్సిపల్ డీఈఈ కార్తీక్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జి రామచంద్రరావు, సత్యనారాయణ, సురేష్, శ్రీధర్, ఉత్పల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.