ఇంద్రవెల్లి /తాంసి(భీంపూర్)/నార్నూర్/గుడిహత్నూర్, అక్టోబర్ 17: ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్ పెన్కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్ హాజరయ్యారు. వారికి గుస్సాడీలతోపాటు దండారీ సభ్యులు, గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివాసీలతో కలిసి ఎస్పీ, ఏఎస్పీ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని, వాటిని పాటిస్తూనే యవతీ యువకులు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్ఐ సాయన్న, ఎస్బి కానిస్టేబుళ్లు రామారావ్, దుర్వా రమణ, గ్రామస్తులు మడావి సుంగు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్లో దండారీ వేడుకల్లో ఎస్పీ, ఏఎస్పీ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. వేడుకల్లో అధికారులు పాల్గొనడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్‌కు భగవాన్పురా దండారీ బృందానికి స్థానికులు అతిథ్యం ఇచ్చారు. బేల్సరి రాంపూర్, ఇందూర్‌పల్లి గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. నార్నూర్, గాదిగూడ మండలంలోని వేడుకలు ప్రారంభమయ్యాయి. నార్నూర్ మండలంలోని సుంగపూర్, గుండాల గ్రామాల్లో భోగి వేడుకలు నిర్వహించారు.