బేల, డిసెంబర్ 18 : సోయా పంటను కొనుగోలు చేయకపోవడంతోపాటు కొనుగోలు చేసిన సోయాను వెనుకకు పంపించడంపై రైతులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం బైఠాయించారు. దీంతో నాలుగు గంటల పాటు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. ఈ ధర్నాకు అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఒక రైతు రాథోడ్ దేవీదాస్ మూర్చ వచ్చి పడిపోయాడు.
ఒక రైతు క్వింటాలుకు రూ.1000 వరకు నష్ట పోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు, అధికారులు విషయం తెలుసుకొని ఆందోళన ప్రాంతానికి వచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో ఫోన్ మాట్లాడి సమస్యలను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహాసిని, బేల మండల బీఆర్ఎస్ నాయకులు దేవన్న, గంభీర్, సతీష్ పవర్, విపిన్ పాల్గొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మారెట్లో అమ్ముకునేందుకు తీసుకొచ్చి నెల రోజులుగా కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈసారి వర్షాల వల్ల నాకు ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు సోయా సాగు చేయగా 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. తీరా చేతి కొచ్చిన పంట అమ్ముదామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదు. తీరా కొనుగోలు చేసిన పంటను కూడా వెనుకకు పంపడంతో రైతులందరం ఇబ్బంది పడుతున్నం. సాగు కోసం చేసిన బ్యాంక్ అప్పుతోపాటు ప్రైవేటు అప్పులు రూ.లక్షలో ఉంది. అవి తీర్చలేక ఇబ్బందులు ఎదురొంటున్నా. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు పంటకు పూర్తి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా.
– రాథోడ్ దేవదాస్, రైతు, చప్రాల గ్రామం