ఆదిలాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) ః జిల్లాలో సోయా రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సోయాబిన్కు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,821 ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు మార్క్ఫెడ్ కేంద్రాల్లో పంటను విక్రయిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ యార్డుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంటను సేకరిస్తున్నారు. పంట సేకరణ ప్రారంభం నుంచి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటలో తేమ, చెత్త ఎక్కువగా ఉందనే నెపంతో కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు పంటను మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టడడంతోపాటు జల్లెడ పట్టిస్తున్నారు. ఇందుకోసం అదనంగా కూలీలకు చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది.
జిల్లాలో ఇప్పటి వరకు 1,61,763 క్వింటాళ్ల సోయాబిన్ను కొనుగోలు చేశారు. రైతు వద్ద నుంచి సేకరించిన సోయాను నిర్వాహకులు గన్నీ సంచుల్లో నింపి గోదాముల్లో భద్రపర్చుతున్నారు. ఒక్కో బ్యాగులో 50 కిలోల సోయాను నింపుతారు. ఇప్పటి వరకు 3,23,527 గన్నీ బ్యాగులను వినియోగించినట్లు అధికారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత కారణంగా పంట సేకరణ నిలిచిపోతున్నది. జైనథ్ మార్కెట్ యార్డులో గన్నీ సంచుల కొరత కారణంగా మంగళవారం నుంచి కొనుగోలు చేయడం లేదు. మార్కెట్ యార్డులో భారీగా కొనుగోలు చేసిన పంట నిల్వలు పేరుకుపోయాయని, గన్నీ సంచులు లేని కారణంగా కొనుగోలు చేయడం లేదని నిర్వాహకులు అంటున్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటను విక్రయానికి తీసుకొచ్చారు. తీరా కొనుగోళ్లు లేకపోవడంతో మార్కెట్ యార్డులోని ఉండాల్సిన పరిస్థితి నెలకున్నది. అధికారులు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో తాము మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చామని, ఇప్పుడు వాహనాలు, కూలీలు కిరాయి తమ అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. గన్నీ సంచుల సమస్య లేకుం డా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సోయాబిన్ కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. నేను 30 క్వింటాళ్ల సోయాబిన్ను విక్రయించడానికి జైనథ్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా సోయాను రెండు రోజుల వరకు కొనమని చెబుతున్నారు. గన్నీ సంచులు లేకపోవడంతో పంటను సేకరించడం లేదని అంటున్నారు. పంటను కొనమని ముందుగా సమాచారం ఇస్తే తీసుకొచ్చేవాళ్లం కాదు. పంట ఎప్పుడు కొంటారని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకున్నది. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి, కూలీలకు డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. సంచుల కొరత లేకుండా అధికారులు చూసుకోవాలి.