చెన్నూర్ రూరల్, ఆగస్టు 16 : కొమ్మెర జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ నూతన బోరు వేయించగా, విద్యార్థుల తాగు నీటి సమస్యకు పరిష్కారం లభించింది. 8 నెలలుగా విద్యార్థులు తాగు నీటికి తిప్పలు పడుతున్నారు. ఈ విషయమై ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’లో ‘అన్నం తిందామంటే నీళ్లు లేవు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయమై స్పెషలాఫీసర్ మల్లికార్జున్ స్పందించి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సరితను ఆదేశించగా, ఆమె పాఠశాలను సందర్శించారు. రెండు రోజుల్లో తాగు నీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. కానీ.. సమస్య పరిష్కారం కాలేదు. ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ‘అధికారులు ఆదేశించినా తాగు నీరేది’ శీర్షికన మరోసారి కథనం ప్రచురితమైంది. ఇందుకు నాయకులు స్పందించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ సహకారంతో డీఎంఎఫ్టీ నిధుల నుంచి శుక్రవారం పాఠశాల ఆవరణలో నూతన బోరు పనులు ప్రారంభించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిత హిమవంత రెడ్డి తెలిపారు. బోరుకు విద్యుత్ మోటర్ ఏర్పాటు చేసి తాగునీరందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముత్యాల బాపగౌడ్, మహేశ్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, కుంట శంకర్ గౌడ్, రాజగౌడ్, దుర్గం సమ్మయ్య, జనగామ పవన్ పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, ఆగస్టు 16: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 98మంది జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లకు అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం)లుగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే ఏఎల్ఎంలుగా విధుల్లో చేరాలని సూచించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు విడుదల కాగా, పదోన్నతులు పొందిన జేఎల్ఎంలందరికీ పోస్టింగ్లు ఇచ్చారు. అర్హతలు సరిగాలేని 10మంది వరకు జేఎల్ఎంలకు పదోన్నతులు రాలేదు.