రైతాంగం.. మూసపద్ధతికి స్వస్తి పలికి.. లాభదాయక పంటలవైపు దృష్టిసారిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నది. నిర్మల్ జిల్లాలో పండించేందుకు అనుమతులు సైతం ఇచ్చింది. ఇక్కడ అనుకూలమైన నేలలు ఉన్నాయని ఉద్యాన శాఖ ఇప్పటికే వెల్లడించింది. కాగా, జిల్లా కేంద్రంలోనే ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుతో పాటు, సబ్సిడీపై ఎరువులు, పరికరాలను కూడా సర్కారే అందిస్తున్నది. తక్కువ ఖర్చు.., అధిక లాభాలు పొందే ఈ పంట సాగుకు రైతులు మొగ్గు చూపేలా భారతీయ ఆయిల్‌పామ్ పరిశోధనా సంస్థ పీయూ (ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సాంకేతిక సహకారంతో చర్యలు చేపడుతున్నది.
– ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 26
జిల్లా నేలలు అనుకూలం..
ఆయిల్‌పామ్ సాగుకు నిర్మల్ జిల్లాలోని నేలలు అనుకూలమైనవి. కాగా, జిల్లాలో నీరు అధికంగా నిలువని, లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగిన నేలలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. కాగా, ఎకరానికి 50 ఆయిల్ పామ్ మొక్కలు నాటాల్సి ఉంటుందని, సమాంతర త్రిభుజాకార పద్ధతిలో 9 మీటర్ల దూరంలో నాటాలి. మొక్క నాటేందుకు 60 సెంటీమీటర్ల గుంత తవ్వాలి. ఏడాదిపాటు నర్సరీలో పెరిగిన మొక్కలను మాత్రమే నాటాల్సి ఉంటుంది. 1.2 మీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను నాటడం వల్ల మొక్కలు త్వరగా నాటుకోవడంతో పాటు, ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది.
అంతర పంటలూ సాగు..
ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. మొక్కల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి 4 ఏండ్ల దాకా ఇతర పంటలు వేసుకునేందుకు ఇబ్బందులుండవు. అయితే ఇందులో పసుపు, మిర్చి, కూరగాయలు, మక్క, పొద్దుతిరుగుడు, సోయాబీన్, పెసలు, మిను ము, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకోవచ్చు. ఆయిల్‌పామ్ సాగు వల్ల చీడపీడల బాధ ఉండదు. ఇతర పంటల సాగుకు అవసరమైన ఎరువులను 30 శాతం వినియోగిస్తే సరిపోతుంది. అలాగే ఈ పంటను కోతులు, ఇతర అటవీ జంతువులు, పక్షులు కూడా నాశనం చేయవు. ఈ పంట కాలపరిమితి 30 ఏండ్లు. మొక్కలు నాటిన నాలుగేళ్ల నుంచి రైతుకు ఆదాయం మొదలవుతుంది. ప్రతి నెలా దిగుబడి వస్తుంది. సాగుకు ఎకరానికి అయ్యే ఖర్చు రూ.30 వేల నుంచి రూ.35 వేలు కాగా, నికర ఆదాయం రూ.90 వేల- రూ.లక్ష వరకు వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ప్రస్తుతం క్వింటాలుకు రూ.15వేలు అందనున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం వివిధ రాయితీలు కల్పించడంతో పాటు, జిల్లాలోని బీరవెల్లి గ్రామంలో నర్సరీని సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ నర్సరీలో 5 లక్షలకు పైగా మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో మొక్క లు కావాల్సిన రైతుల కోసం మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అందుబాటులోనే నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలంగా ఉండడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోనే 60 ఎకరాల్లో ప్రభుత్వం ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్లో పట్టు పరిశ్రమ శాఖకు చెందిన స్థలంలో అధికారులు ఎకరం సాగు చేశారు. ప్రస్తుతం ఏపుగా పెరిగి పూత దశలో ఉన్నాయి. ఇప్పటికే అయా మండలాల నుంచి రైతులను ఇక్కడికి తీసుకొచ్చి సాగు విధానంపై స్టడీ టూర్ నిర్వహించారు. దీంతో రైతులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రభుత్వం రాయితీలు..
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలను కల్పిస్తున్నది. ఒక్కో మొక్కను కేవలం రూ. 20కే అందజేస్తున్నది. అంతర పంటల సాగు, ఎరువుల కోసం ఏడాదికి రూ.4200 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తుంది. మొత్తం రూ.16,800 ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే బిందుసేద్యం ద్వారా అర్హులైన రైతులకు 80 నుంచి వందశాతం రాయితీపై పరికరాలు అందిస్తున్నది. అలాగే నర్సరీ దగ్గర మొక్కల లోడింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. అలాగే రైతులను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో పాటు, రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
– మౌనిక, ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి