మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు రుణాలు మంజూరు చేస్తున్నది. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయం, అనుబంధ రంగాలు, కిరాణా, పిండిగిర్ని, టైలరింగ్, బ్యూటీపార్లర్, ఫుట్‌వేర్ వంటి వ్యాపారాలు చేసుకునేందుకు అందిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఈ యేడాది రుణ లక్ష్యం రూ.351.17 కోట్లు కాగా.. ఈ ఐదు నెలల కాలంలోనే రూ.128.11 కోట్ల మేర అందించారు. పూర్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 10,678 గ్రూపులు ఉండగా.. ఇందులో 3 వేలకుపైగా సంఘాలకు రుణాలు అందించారు.
స్వయం సహాయక సంఘాలు -10,678
ఈ ఏడాది రుణ లక్ష్యం – రూ. 351.17 కోట్లు
ఇప్పటివరకు అందజేసిన రుణాలు – రూ. 128.11 కోట్లు
నిర్మల్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : మహిళల ఆర్థిక అభ్యున్నతికి గ్రామీణాభివృద్ధి శాఖ యేటా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కిరాణం, టైలరింగ్, బట్టల దుకాణం, వ్యవసాయం, పాడి పశువుల పెంపకం వంటి జీవనోపాధికి సంబంధించిన యూనిట్లను నెలకొల్పుకునేందుకు రుణాలను విరివిగా అందిస్తున్నారు. తీసుకున్న రుణాలను ఏ విధంగా పెట్టుబడికి ఉపయోగించాలో.. సకాలంలో తిరిగి రుణాలు చెల్లించేలా అవగాహన కల్పించి వారిని చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా మహిళా సంఘాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
35 శాతానికి చేరిన రుణలక్ష్యం..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఒక జిల్లా సమాఖ్య, ప్రతి మండలానికో మండల సమాఖ్య, ప్రతి పంచాయతీకి గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,678 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. వీటికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.351.17 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆగస్టు నెల నాటికి 3,598 సంఘాలకు రూ.128.11 కోట్లు రుణంగా అందించారు. దిలావర్పూర్, లోకేశ్వరం, కుంటాల, నిర్మల్ రూరల్, మామడ మండలాల్లో ఇప్పటికే రుణ లక్ష్యం సగానికి చేరువైంది. ప్రస్తుతం జిల్లా రుణలక్ష్యం 35 శాతానికి చేరగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగియకముందే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
స్వయం సమృద్ధి దిశగా సంఘాలు
ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో జిల్లాలోని మహిళా సంఘాలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయం, అనుబంధ రంగాలు, కిరాణా దుకాణాలు, పిండిగిర్ని, టైలరింగ్, బ్యూటీపార్లర్, ఫుట్‌వేర్ వంటి వ్యాపారాలకు రుణాలను అందిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలు అందజేస్తున్నారు. గతంలో బ్యాంకు లింకేజీ కింద రూ.లక్ష రుణం ఇచ్చేవారు. అయితే గతేడాది నుంచి దాన్ని రూ.2 లక్షలకు పెంచారు. యేటా రుణ ప్రగతిలో జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందుతుండడంతో అదే ఉత్సాహంతో ఈసారి కూడా రుణాలు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమిస్తాం..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు లింకేజీ వార్షిక రుణ లక్ష్యం పెరిగింది. యేటా ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ఏడాది నిర్దేశించుకున్న రూ.351.17 కోట్ల రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం. కలెక్టర్ ఆదేశాలు, సూచనల కనుగు ణంగా మండలాలవారీగా సమీక్షలు నిర్వహించి అర్హులైన వారందరికీ రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
– గోవిందరావు, అడిషనల్ డీఆర్డీవో, నిర్మల్