భీమారం, మే 5 : ‘సారూ..మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు..కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం.. మాకు నీళ్లు వచ్చేలా చూడండి’ అంటూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఎదుట భీమారం మండలంలోని ఆరెపల్లి, బూరుగుపల్లి గ్రామస్తులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సోమవారం ఆరెపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. దీంతో బీసీ కాలనీ వాసులు అక్కడికి చేరుకొని కలెక్టర్‌కు నీటి ఎద్దడిపై విన్నవించారు.
వెంటనే స్పందించిన కలెక్టర్ బీసీ, ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. తాగునీటి సమస్యపై కాలనీలో ఆరాతీశారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పూర్తిగా వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి కాలనీవాసులు తీసుకువచ్చారు. నీటి సమస్యపై యాప్‌లో వివరాలు ఎందుకు నమోదు చేయడం లేదని పంచాయితీ కార్యదర్శి దేవేందర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.