సీసీసీ నస్పూర్, మార్చి 10: టీఎస్పీఎస్సీ సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయగా, సీసీసీ నస్పూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడి కుమారుడు రిక్కుల సత్యనారాయణరెడ్డి క్వాలిఫై అయ్యాడు. న్యూ నాగార్జున కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి సీసీసీ నస్పూర్ ఏరియాలోని వర్క్‌షాప్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి అంజలి గృహిణి. సత్యనారాయణరెడ్డి స్థానిక మార్టిన్ గ్రామర్ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివాడు. 9,10 తరగతులు వరంగల్‌లోని గ్రీన్వుడ్ పాఠశాలలో పూర్తి చేశాడు.
ఆపై హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివాడు. అనంతరం హైదరాబాద్‌లో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. అది సాధ్యం కాకపోవడంతో గ్రూప్స్‌పై దృష్టి పెట్టాడు. 2022 నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా కష్టపడి చదివి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు రాశాడు. సోమవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 900 మార్కులకుగాను 420 మార్కులు సాధించి క్వాలిఫై అయ్యాడు. సత్యనారాయణ రెడ్డి అర్హత సాధించడంపై అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.