మంచిర్యాల, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి లాభం రూ.4,701 కోట్లు అని ని న్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో రూ.2,283 కోట్లు సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన పెట్టి, మిగిలిన రూ. 2,414 కోట్లలోనే 33 శాతం వాటా రూ.796 కోట్లు కార్మికులకు ఇస్తున్నట్లు చెప్పారన్నారు. లాభాల్లో వాటా ఇస్తే మొత్తం రూ.4,701 కోట్లలో 33 శాతం అంటే రూ.1,550 కోట్లు ఇవ్వాలి. కానీ.. సగం ఇచ్చి గత ప్ర భుత్వం కంటే ఒక్క శాతం ఎక్కువ వాటా ఇచ్చామని సంకలు గుద్దుకోవ డం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గత కేసీఆర్ సర్కారు సింగరేణి కార్మికులకు మొత్తం నికర లాభంలో వాటా ఇచ్చింది. తప్పితే ఇలా కట్ చేసి ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ వాటా ఇచ్చినట్లు ప్రకటించినా.. గడిచిన పదిహేనేళ్లలో ఇది చాలా తక్కువ వాటా అంటున్నారు. 2014లో 21 శాతం లాభాల్లో వాటా ఇచ్చారని, కేసీఆర్ స ర్కారు వచ్చాక ప్రతి ఏడాది దానిని పెంచుకుంటూ పోయిందన్నారు. గతేడాది వచ్చిన రూ.2,222 కోట్లలో 32 శాతం రూ.710 కోట్ల వాటా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం కంటే ఒక శాతం ఎక్కువ 33 శాతం అని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు కార్మికుల కడుపు కొడుతున్నారన్నారు. రేవంత్ చెప్పేదొకటి.. చేసేదొకటని మరోసారి రుజువైందంటున్నారు. కార్మికులను మోసం చేస్తే పుట్టగతులుండవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మందమర్రి ఏరియా కాసిపేట 2 ఇైంక్లెన్ గనిలో ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ పెట్టి లాభాల వాటాపై మాట్లాడుతుండగా కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఐఎన్టీయూసీ నాయకులు పుల్లూరి లక్ష్మణ్సహా ఆయనతో వచ్చిన వారిని నిలదీశారు. “సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వస్తే అందులో మాకు 33 శాతం అంటే ఎంత వస్తదో చెప్పాలన్నారు. లాభాల్లో 33 శాతం అంటే రూ.1,550 కోట్లు రావాలి. కానీ.. ప్రకటించింది మాత్రం రూ.796 కోట్లేనన్నారు. లాభాల్లో రూ.2,283 కోట్లను పక్కన పెట్టి మిగిలిన దాంట్లో వాటా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ తీయలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు.
ఇంచుమించు సగానికి ఎక్కువ బోనస్ తీసుకుని, మిగిలింది మాకు ఇస్తే అది 33 శాతం ఎలా అవుతుందన్నారు. ఎంత లెక్కలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది 16 శాతం నుంచి 17 శాతమే వస్తుందన్నారు. సింగరేణి సంస్థ మొదలైనప్పుడు ఎంత బోనస్ ఇచ్చారో.. ఇప్పుడే మళ్లీ అక్కడికి తీసుకొచ్చారంటూ..” కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు లెక్కలేసి మరీ చెప్పడంతో ఐఎన్టీయూసీ నాయకులు సమాధానం చెప్పలేక పోయారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల్లో అసహనం కనిపించింది. ఎవరిని కదిపించినా కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. ఇదేం వాటా అంటూ కార్మికులు మండిపడుతున్నారు.
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 21 : సింగరేణి కార్మికులను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘాన్ని అదుపులో పెట్టుకొని మోసం చేస్తున్నాయి. కార్మికులకు న్యాయంగా రూ.1550 కోట్ల లాభాల వాటా ఇవ్వాలి. ఇప్పుడు కేవలం రూ.796 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. గతేడాది రూ.2222 కోట్ల లాభాలు వస్తే, ఈ ఏడాది రూ.4701 కోట్ల లాభాలు వచ్చాయి. అంటే కార్మికులకు కూడా లాభాల వాటా డబుల్ రావాలి కదా ?. డబుల్ ప్రాఫిట్ వచ్చినప్పుడు, డబుల్ వాటా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-మోటపలుకుల గంగాధర్ కోల్కట్టర్, శ్రీరాంపూర్
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 21 : సింగరే ణి సంస్థ లాభాలు కార్మికులకు తక్కు వ చేసి ఇవ్వడంపై కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు నికర లాభాల్లో వాటా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని దోచుకుంటున్నది. సంస్థ విస్తరణకు ఒకే సంవత్సరం నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. కానీ విస్తరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్లు దోచుకుంటుంది. కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికుల కష్టాన్ని రేవంత్రెడ్డి సర్కార్ దోచుకుంటుంది.
-సందవేణ శ్రావణ్, జనరల్మజ్దూర్, శ్రీరాంపూర్
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 21 : సింగరేణి వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు లాభాల వాటా 33 శాతం ఇవ్వాలి. ప్రభుత్వానికి సంస్థ నిధులు ధారాదత్తం చేయడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. రూ.4701 కోట్ల నికర లాభాల నుంచి 2,289 కోట్లు పక్కన పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు రూ.4701 కోట్ల నికర లాభాల్లో నుంచి 33 శాతం చెల్లించాలి. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 32 శాతం లాభాల వాటా రూ.711 కోట్లతో చూసుకుంటే ఈ సంవత్సరం కార్మికులకు లాభాల వాటా తక్కువగానే వచ్చినట్లుగా చెప్పవచ్చు. కార్మికులను యాజమాన్యం, ప్రభుత్వం మోసం చేస్తుంది.
-ఇస్లావత్ గోపాల్, ట్రామర్ ఎస్ఆర్పీ 3, శ్రీరాంపూర్
గత సంవత్సరం వచ్చిన రూ.2,222 కోట్ల లాభాల్లో 32 శాతం దాదాపు రూ.710 కోట్లు కార్మికులకు ఇచ్చారు. ఈ ఏడాది రూ.4,701 కోట్లలో 33 శాతం రూ.1,550 కోట్లు కార్మికులకు ఇవ్వాలి. అలా కాకుండా రూ.796 కోట్లు ఇచ్చారు. అంటే కేవలం 16.9 శాతమే ఇచ్చారు. పెంచి ఇచ్చారా.. తగ్గించి ఇచ్చారా అని కార్మికలోకం ఆలోచించాలి. గతేడాది లేని కోతలు ఇప్పుడెందుకు పెట్టారో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
– కొత్తపల్లి ఉదయ్, కాసిపేట 2 ఇైంక్లెన్