టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాల వైఖరిని ఎండగడుతూనే.. తాము సాధించిన ఘనతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నది. గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సౌకర్యాలే తిరిగి గెలిపిస్తాయన్న ధీమా నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఇక ఏఐటీయూసీ, ఐన్టీయూసీలు చేసిందేమీ లేదని, తమను కంటికి రెప్పలా కాపాడుకున్న బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్నే గెలిపించుకుంటామని కార్మిక లోకం స్పష్టం చేస్తున్నది.
శ్రీరాంపూర్, డిసెంబర్ 25 : తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం.. సింగరేణి చరిత్రలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమేగాక లెక్కకు మించి హకులు సాధించి కార్మికుల మనసును గెలుచుకున్నది. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో సంస్థ ప్రగతికి కృషి చేయడమేగాక కార్మికుల పక్షాన నిలిచి అనేక ప్రయోజనాలు సాధించింది. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకొని ఒక పోరాటమైనా లేకుండా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని అభివృద్ధి సాధించింది. నూతన హకులతో పాటు జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన హకులను కూడా సాధించి కార్మికుల గుండెల్లో గూడు కట్టుకున్నది.
1998, 2001లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ఎలాంటి హకులు, ప్రయోజనాలు కల్పించిందో కార్మిక వర్గానికి తెలుసు. అందుకే 2003లో జరిగిన ఎన్నికల్లో ఆ సంఘాన్ని ఓడించి.. ఐఎన్టీయూసీకి పట్టం కట్టారు. ఐన్టీయూసీతోనైనా తమకు లాభం జరుగుతుందేమోనని ఆశించిన కార్మిక లోకానికి చివరికి నిరాశే మిగిలింది. ఇలా ఏఐటీయూసీ కాకపోతే.. ఐఎన్టీయూసీ.. ఐఎన్టీయూసీ కాకపోతే.. ఏఐటీయూసీ గెలుచుకుంటూ వచ్చాయి. 12 ఏళ్లు గుర్తింపు కార్మిక సంఘాలుగా ఉండి కార్మికులకు చేసిందేమీ లేకపోగా.. వారసత్వ ఉద్యోగాలు ఊడగొట్టింది. ఈ విషయాన్ని కార్మిక కుటుంబాలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాయి. అలాంటి వారికి ఓట్లు అడిగే హక్కు లేదని, ఈ ఎన్నికల్లోనూ టీబీజీకేఎస్‌కే పట్టం కట్టి.. ఏఐటీయూసీ, ఐన్టీయూసీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
2012 అక్టోబర్ 5న.. జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక వర్గం టీబీజీకేఎస్‌ను ఆదరించింది. 23,311 ఓట్లు అందించి గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్‌ను నిలబెట్టింది. కేసీఆర్ సర్కారు సహకారంతో సింగరేణి చరిత్రలో లేనివిధంగా అనేక హకులు సాధించి కార్మికుల చేత ప్రశంసలు అందుకున్నది. 2017లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ విజయం సాధించింది. 23,845 ఓట్లు సాధించింది. కార్మికులు గత ఎన్నికలకంటే 534 ఎక్కువ ఓట్లతో గెలిపించారు. ఇక ఈ నెల 27న నిర్వహించనున్న గుర్తింపు ఎన్నికల్లోనూ మరోసారి గెలిచేందుకు టీబీజీకేఎస్ ఉవ్విళ్లూరుతున్నది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సూచనలతో నాయకులు హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. పక్షం రోజులుగా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, ఓసీపీలపై బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఆఖరి రోజు శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5, 6, 7, వర్కషాప్లో సోమవారం టీబీజీకేఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేశారు. టీబీజీకేస్ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్, మాజీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి తొంగల రమేశ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సాదుల భాస్కర్, వెంకట్‌రెడ్డి, మల్లేశ్, రాజునాయక్, ప్రసాద్, పవణ్, లాల్లు గనులపై తిరిగి బాణం గుర్తుకు ఓటు వేసి గెలపించాలని కోరారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కారు 20 వేల ఉద్యోగాలు కల్పించిందని, యువ కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించి కేసీఆర్‌కు కృతజ్ఞత చాటు కోవాలని కోరారు.
హక్కులు సాధించిన టీబీజీకేఎస్ కావాల్నో.. ఉన్న హక్కులు పోగొట్టిన ఏఐటీయూసీ, ఐన్టీయూసీ కావాల్నో నిర్ణయించుకోవాలని సూచించారు. వికాస్, గోనె స్వామి, గరిగె చేరాలు, సతీష్, ప్రశాంత్, రాజయ్య, ఉత్తేజ్‌రెడ్డి, హరీశ్ పాల్గొన్నారు. ఇక శ్రీరాంపుర్ ఏరియా ఆర్కే 7, 7ఏ, ఏరియా వర్కషాప్పై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, కలవేణ శ్యాంకుమార్ ప్రచారం నిర్వహించారు. అలాగే ఆర్కే-5గనిపై కేంద్ర నాయకులు కే సురేందర్‌రెడ్డి, ప్రచారం చేశారు. ఐఎన్టీయూసీ నాయకులు గరిగె స్వామి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. సోమవారం ఆర్కే 7గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు తిప్పారుపు సారయ్య మాట్లాడారు.
నాయకులు రాజేంద్రస్రాద్, అశోక్, నవీణ్, నర్సయ్య, బాలయ్య, రమేశ్, శ్రీనివాస్, తులా అనిల్, వెంకటస్వామి పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5గనిపై బీఎంఎస్ జాతీయ బొగ్గు గనుల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, బ్రాంచ్ కార్యదర్శి నాతాడి శ్రీధర్‌రెడ్డి, నాయకులు నాగేశ్వర్రావు, తిరుపతి, రమేశ్, గూడ శ్రీకాంత్‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, మహేశ్, రాజేంద్ర, పోతరాజు పాల్గొన్నారు. కాగా, ఎన్నికల్లో గెలుపొందేందుకు కొన్ని సంఘాలు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ కార్మికులను ప్రలోభాలకు గురిచేయడం మొదలు పెట్టాయి. కార్మిక వర్గానికి కేసీఆర్ ప్రభుత్వం సాధించి పెట్టిన కారుణ్య ఉద్యోగాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సౌకర్యాలే తిరిగి టీబీజీకేఎస్‌ను గెలిపిస్తాయని ఆ సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.