మంచిర్యాల, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్దపీట వేస్తున్నది. దసరా, దీపావళి బోనస్‌లు, లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్‌లో దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాలను సింగరేణి సంస్థ కార్మికులకు ఇస్తున్నది. కాగా, సింగరేణిని కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కొన్ని సంస్థలు లాభాపేక్షతో చేసే పనులు సంస్థను అభాసుపాలు చేస్తున్నాయి. శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలకు సంబంధించి డ్రిల్లింగ్, ఎక్సావేక్షన్, లోడింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, డంపింగ్, స్ప్రెడ్డింగ్, లెవలింగ్ మొదలైన ఓవర్ బర్డెన్ పనులు చేసేందుకు సింగరేణి సంస్థ ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
48 నెలల కాలానికి ఈ పనులు చేసేందుకు సదరు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు 18 నెలలు(ఏడాదిన్నర) పూర్తయ్యింది. కాగా, ఈ కాంట్రాక్టర్ సంస్థ నియమించుకున్న కార్మికులకు ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) జమ చేయడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈపీఎఫ్ చట్టాన్ని అనుసరించి కార్మికులకు ఇచ్చే వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ కట్ చేసుకుని, మరో 12 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను సంస్థ ఈఫీఎస్ అకౌంట్లో జమ చేయాలి. కానీ, ఈ కాంట్రాక్టర్ సంస్థ అలా చేయకుండా కార్మికులకు న్యాయంగా దక్కాల్సిన డబ్బులను మిగిల్చుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
నిబంధనల ప్రకారం వేజ్ సీలింగ్ లిమిట్ రూ.15 వేలుగా ఉంది. ప్రస్తుతం శ్రీరాంపూర్ ఓసీపీలో కాంట్రాక్టర్ సంస్థలో పని చేసే కార్మికులకు రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. వేజ్ సీలింగ్ లిమిట్ కంటే ఎక్కువ వేతనాలు ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం 12 శాతం ఈపీఎఫ్ జమ చేయడం లేదు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వరకు పని చేస్తున్నట్లు తెలిసింది. కానీ, అధికారిక సమాచారం చూసుకుంటే 496 మంది కార్మికులకు ఈపీఎఫ్ జమ చేస్తున్నట్లు తెలిసింది.
సుమారు 400 మంది అనుకుంటే ఈ 400 మందికి ఒక్కొక్కరికి రూ.15 వేల జీతం ఇచ్చినా, 12 శాతం ఈపీఎఫ్ రూ.1800 కట్టాలి. కానీ, గడిచిన 18 నెలల్లో ఏ ఒక్క నెల కూడా రూ.1800 జమ చేయలేదని ఇక్కడ పనిచేసే కార్మికులే చెప్తున్నారు. ప్రతి నెల రూ.800 నుంచి రూ.1000 మాత్రమే ఈపీఎఫ్ కడుతున్నారని చెప్తున్నారు. ఈ లెక్కన నెలకు ఒక్కో కార్మికుడిపై రూ.800 మిగుల్చుకుంటున్న సంస్థ ప్రతి నెల రూ.3.20 లక్షలు కార్మికులకు న్యాయంగా రావాల్సిన సొమ్మును అప్పనంగా నొక్కేస్తున్నట్లు అవగతం అవుతున్నది. 18 నెలలకు చూసుకుంటే రూ.57.60 లక్షల కార్మికుల సొమ్ము స్వాహా చేసినట్లు స్పష్టం అవుతున్నది.
కాంట్రాక్టర్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు/ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను బిల్స్ తీసుకునేప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమర్పించి క్లియరెన్స్ తీసుకోవాలి. క్లియరెన్స్ ఇచ్చే ముందు సంబంధిత అధికారులు నిబంధనలను అనుసరించి వేతనాలు ఇచ్చారా? ఈపీఎఫ్ ఇచ్చారా? అని వెరిఫై చేసుకున్నాకే బిల్లులు మంజూరు చేయాలి. కానీ, ఈ కాంట్రాక్టర్ సంస్థ అలాంటివి ఏం చేయడం లేదని తెలిసినప్పటికీ శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి, జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బిల్లులు ఎలా మంజూరు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అధికారులు కావాలనే సదరు కాంట్రాక్టర్ సంస్థకు అనుకూలంగా బిల్లులు ఇచ్చారని ఓపీసీలో పని చేసే కార్మికులు ఆరోపిస్తున్నారు. విషయం బయటికి చెప్తే ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అన్న భయంతో ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని వాపోతున్నారు. అంతకుముందు పని చేసిన కాంట్రాక్ట్ సంస్థ నెలకు రూ.1700 నుంచి రూ.1800 ఈపీఎఫ్ ఇచ్చిందని, మరి ఈ సంస్థ అంత ఎందుకు ఇవ్వలేదనేది బిల్లులు విడుదల చేసేముందు అధికారులు ఆలోచించాలి కదా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా సింగరేణి సంస్థ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటారా.. బాధ్యులైన అధికారుల, కాంట్రాక్టర్ సంస్థపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
సింగరేణి సంస్థ ఇచ్చిన వర్క్ ఆర్డర్ నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు న్యాయం రావాల్సిన ఈపీఎఫ్‌లో కోతలు పెట్టి లక్షలు మిగుల్చుకోవడం హేయమైన చర్య. సదరు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెల్లించిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలి. ఇందుకు పరోక్షంగా సహకరించిన సింగరేణి అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
– నహీం పాషా, సామాజిక కార్యకర్త.
ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐలో అన్ని విషయాలపై మా అధికారులు క్లారిటీ ఇచ్చారు. విచారణలో నిజమని తేలితే సదరు కాంట్రాక్టర్ బిల్లుల్లో ఆ మొత్తాన్ని కట్ చేస్తారు. పూర్తి వివరాలపై నాకు స్పష్టత లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్, శ్రీరాంపూర్ ఓసీపీ