నిర్మల్, జనవరి 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో దూసుకుపోయిన పల్లెలు.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 399 పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఎన్నుకున్నారు. దస్తురాబాద్ మండలంలోని పెర్కపెల్లి గ్రామంలో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఎన్నిక జరుగలేదు. రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగిన పల్లెలు.. ఇకపై సర్పంచ్, వార్డు సభ్యుల పాలనలో ముందుకు సాగనున్నాయి.
జీపీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా రెండేళ్లపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా పారిశుధ్యానికి పెద్దపీట వేసింది. పల్లె పల్లెన ప్రకృతి వనాల ఏర్పాటు, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో గ్రామాలు పచ్చదనాన్ని పరుచుకొని ఆహ్లాదభరితంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం పల్లెలన్నీ కళావిహీనంగా మారాయి.

సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటవీ ప్రాంతంలో ఉన్న అనేక మారుమూల గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా మారాయి. మొదట నిర్మల్ జిల్లాలో 240 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండగా, ఇందులో మూడు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా మరో 163 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇందులో గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలతోపాటు, అనుబంధ గ్రామాలు ఉన్నాయి. కొత్త పంచాయతీలతో కలిపి 400 జీపీల పరిధిలో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో పల్లెలు పచ్చగా మారి, ప్రగతి బాట పట్టాయి. పచ్చదనం, పరిశుభ్రత విభాగాల్లో అనేక గ్రామాలు అవార్డులు దక్కించుకున్నాయి.
రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం, నిధులు సక్రమంగా రాకపోవడంతో సమస్యలకు నిలయాలుగా మారాయి. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం సవాల్‌గా మారింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలో తెలియక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాలకు నిధుల మంజూరుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కొత్త పాలకవర్గాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అనేక గ్రామాల్లో కనీసం పారిశుధ్య పనులు కూడా చేయించలేని పరిస్థితి ఉంది. పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేకపోవడం, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించేందుకు నిధులు లేని దుస్థితి నెలకొన్నది. పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో పల్లెలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది సర్పంచ్‌లు చేసేదేమి లేక సొంత నిధులు వెచ్చించి అత్యవసర పనులు చేయిస్తున్నారు.

డబ్బుల కోసం ఎదురుచూపు
20 రోజుల క్రితం కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. 2024 ఫిబ్రవరి నుంచి జీపీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు, పారిశుధ్య పనులు, పచ్చదనం కార్యక్రమాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లెప్రగతి వంటి పథకాలు ముందుకు సాగడం లేదు. పల్లెల్లో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల పాలన ఆరంభం కావడంతో జీపీలకు డబ్బులు ఎప్పుడు వస్తాయోనని సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా మళ్లీ పల్లెలన్నీ ప్రగతి బాటన ముందుకు సాగుతాయా? అని గ్రామీణులు చర్చించుకుంటున్నారు.
సొంత నిధులు ఖర్చు చేస్తున్నం..
సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 రోజులు అవుతున్నది. పంచాయతీలకు నిధుల కేటాయిం పు విషయంలో ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రకటన రాలేదు. పంచాయతీ ఖాతాలో కూడా రూపాయి నిల్వ లేదు. ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చినం. కొత్తగా ఎన్నికైన తమపై ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. ప్రస్తుతానికైతే సొంత నిధులు వెచ్చించి అత్యవ సర పనులు చేయిస్తున్న. గ్రామంలోని ఓ కాలనీలో చెడిపోయిన బోరుకు మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెచ్చా. అలాగే కొత్త కాలనీకి సరైన దారి లేకపోవడంతో సొంత నిధులతో మట్టి రోడ్డు వేయించిన. గ్రామంలోని కస్తూర్బా పాఠశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం తో నిండిపోవడంతో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో శుభ్రం చేయించా. అలాగే గ్రామ పంచాయతీ భవనానికి రంగులు వేయించి, అవసరమైన ఫర్నీచర్ సమకూర్చా. గ్రామంలో నిరుపయోగంగా మారిన రూర్బన్ పార్క్, ఓపెన్ జిమ్‌ను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేసి స్థానిక సంస్థలను కాపాడాలి. గతంలో చేసిన పనులకు బిల్లులకు డబ్బులు చెల్లించాలి. – పెంటావార్ దశరథ్, సర్పంచ్, కల్లుర్, కుంటాల మండలం