హాజీపూర్/మందమర్రి/రెబ్బెన, మార్చి 14 : శుక్రవారం వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వాసులు సత్తా చాటారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లెక్కల లింగయ్య-కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్ రాష్ట్ర స్థాయిలో 39వ ర్యాంక్ సాధించాడు. మూడు రోజుల క్రితం వెలువడిన గ్రూపు 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. గ్రూప్-4లో స్టేట్ లెవల్లో 210వ ర్యాంక్, జిల్లాలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. కొద్ది రోజులు ఉద్యోగం చేసి.. తర్వాత రాజీనామా చేశాడు. ప్రస్తుతం గ్రూప్-3 ఫలితాల్లో విజయం సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
మందమర్రి పట్టణంలోని ప్రాణహిత కాలనీకి చెందిన బొడ్డు పోశక్క-భూమయ్య దంపతుల చిన్న కుమారుడైన తిరుపతి స్థానిక కార్మెల్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఆపై బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లొమా విద్యనభ్యసించాడు. 2016లో సింగరేణి సంస్థలో జేఎంఈటీ నోటిఫికేషన్ వెలువడగా, పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు.
అనంతరం దూరవిద్య కాకతీయ యునివర్సిటీలో బీఏ పూర్తి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన గ్రూప్-4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి క్యాతనపల్లి మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు. ఇటీవల వెలువడిన గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 77వ ర్యాంకును సాధించాడు. శుక్రవారం వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించాడు. వరుస ఉద్యోగాలు సాధించిన తిరుపతిని కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని, అందుకు సిద్ధమవుతున్నానని తిరుపతి తెలిపాడు.
రెబ్బెన, మార్చి 14 : కౌటల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన భాస్కర్ 2016లో సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గోలేటిటౌన్‌షిప్‌లోని గ్రంథాలయంలో ప్రిపరేషన్ కొనసాగించి గ్రూప్-2 ఫలితాల్లో 229 ర్యాంక్ సాధించగా, తాజాగా గ్రూప్-3 ఫలితాల్లో 154 ర్యాంక్ సాధించి ప్రతిభ చాటుకున్నాడు.