కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ టౌన్, మార్చి 22: అధికార కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ ముదురుతున్న విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిగా ఉన్న రావి శ్రీనివాస్ తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారుతున్నదని, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై, ఎమ్మెల్సీ దండె విఠల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జీ. చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రావి శ్రీనివాస్‌కు చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొనడం జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
అధిపత్య పోరులో ముదురుతున్న విభేదాలు
సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ దండె విఠల్ వర్గం, రావి శ్రీనివాస్ వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారు. అధికారిక హోదాలో ఎమ్మెల్సీ దండె విఠల్ చెప్పిన పనులు మాత్రమే జరుగుతున్నాయి. అధికారిక వర్గాలు కూడా రావి శ్రీనివాస్‌ను గానీ, ఆయన వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వడం లేదని తెలుస్తున్నది. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కూడా తన మాట పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ చేస్తే కూడా మంత్రి సీతక్క స్పందించడం లేదని రావి శ్రీనివాస్ మీడియా ముందు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
కొన్నిరోజులుగా రావి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు మంత్రి సీతక్కపై, ఎమ్మెల్సీ దండె విఠల్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల దండె విఠల్ నివాసం ముందు తన వర్గానికి చెందిన కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రావి శ్రీనివాస్‌పై జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జీ. చిన్నారెడ్డి రావి శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనూ డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావుకు ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మధ్య విభేదాలతో అధిపత్య పోరు కొనసాగుతున్నది.
మంత్రికి రావి శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలి
ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివాసీ సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్కపై చేసిన వ్యాఖ్యలపై రావి శ్రీనివాస్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేదంటే శ్రీనివాస్‌పై ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గణపతి, జైనూర్ మారెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జిల్లా నాయకులు శ్యామ్, చరణ్, వసంతరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ నియోజవర్గ పార్టీ ఇన్చార్జి రావి శ్రీనివాస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తామని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.