రైల్వే, రోడ్ల భద్రత డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య
వర్చువల్ విధానంలో జిల్లా, మండల స్థాయి కమిటీ సమావేశం
ఎదులాపురం, ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య వంతులు చేయాలని రైల్వే, రోడ్ల భద్రత డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య అన్నారు. సోమవారం వర్చువల్ విధానం ద్వారా రైల్వే, రోడ్ల భద్రతపై జిల్లా, మండల స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు కలెక్టర్ నేతృత్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరుగకుండా ముందస్తు సూచిక బోర్డులు, రాత్రి వేళల్లో సూచికలు తెలిసే విధంగా రేడియంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజినీరింగ్ అధికారులు శాశ్వత ప్రాతిపదికన ప్రమాద రహిత చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాహనాదారుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపితే ప్రమాదాలు జరిగి వారి కుటుంబం తీరని బాధకు లోనవుతుందన్నారు. జంక్షన్లు, వైజంక్షన్ల సమీపంలో మొక్కలు తొలగించాలని సూచించారు. రాత్రి వేళల్లో పశువులు, ఎడ్లబండ్లు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఆయ ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవలం చలాన్ వేయడమే కాకుండా ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు.
వచ్చే సమావేశం నాటికి ప్రమాదాల అదపునకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న నేరడిగొండ, గుడిహత్నూర్, జైనథ్ మండలాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం నిరోధించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్లు రవాణా శాఖ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.