
ఎదులాపురం, డిసెంబర్ 6 : లైంగిక వేధింపులకు గురైన బాధితులకు షీటీం సభ్యులు అండగా ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో షీటీం సభ్యులతో సమావేశమయ్యారు. విధినిర్వహణలో ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లైంగిక వేధింపులకు గురవుతున్న బాధితుల మదిలో అనేక అభద్రతాకరమైన ఆలోచనలు వస్తుంటాయన్నారు. ఫిర్యాదు చేయడానికి ముందు ఎన్నో సమస్యలను అధిగమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి సమయంలోనే షీ టీం సభ్యులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. బాధితుల ప్రతిష్టకు భంగం కలుగకుండా సున్నితంగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చర్యలపై బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించే ప్రధానమైన విధులు నిర్వహిస్తున్న షీటీం సభ్యులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద నిఘా పెట్టాలని సూచించారు. కళాశాలల పరిధిలో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా ఏర్పాటు చేసి ఫిర్యాదు చేయడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రచారం చేయాలని సూచించారు. డయల్100 ప్రాముఖ్యతను బాధితులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో మహిళా ఎస్ఐ పీ దివ్యభారతి, షీటీం ఇన్చార్జిలు ఈ సునీతారెడ్డి, కే ఉజ్వల, బీ సుశీల, కే వాణీశ్రీ, గిరిధర్, జీ సంతోష్ కుమార్, ఆడే ఉత్తం, యు అశోక్, సీ భాగ్యశ్రీ పాల్గొన్నారు.
నీట్ ర్యాంక్‌కు ఇన్చార్జి ఎస్పీ అభినందన
నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 459 సాధించిన, నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ రాథోడ్ గణపతి కుమారుడు రాథోడ్ చంద్రకాంత్‌ను ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర అభినందించారు. సోమవారం ముఖ్య కార్యాలయంలో తండ్రీకొడుకులను ఆహ్వానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పిల్లల ఉన్నత చదువులతో పోలీసులకు గుర్తింపు వస్తుందన్నారు. ర్యాంక్ సాధించిన చంద్రకాంత్‌కు హర్యానా రాష్ట్రంలోని కురక్షేత్ర యూనివర్సిటీలో సీటు వచ్చిందని తెలిపారు. జాతీయ స్థాయిలో మరింత రాణించి ఉన్నత ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం పరిపాలనాధికారి మహ్మద్ యూనుస్ అలీ, పోలీస్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, రిజర్వ్ సీఐ ఎం.వంశీకృష్ణ, ఫిర్యాదుల విభాగం ఇన్చార్జి జైస్వాల్ కవిత పాల్గొన్నారు.
వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకం
రానున్న ఆరు వారాలు అత్యంత కీలకమని ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రచారంలో ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్‌లు ధరించి పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విస్తృతంగా మాస్క్‌లు ధరించడంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. తద్వారా మాస్క్‌లు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. పోలీస్ శాఖలోని అందరు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా.. పట్టణంలోని బస్టాండ్‌లో ప్రయాణికులకు కొవిడ్ నిబంధనలపై ట్రాఫిక్ ఎస్ఐ షేక్ అబ్దుల్ బాకీ అవగాహన కల్పించారు.