ఆదిలాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు ఆందోళనలు జరిగా యి. ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. డీలర్ల సంఘం అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపా ల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం డీలర్లకు రావాల్సిన కమీషన్ ఇవ్వకపోవడంతో తాము ఉపాధి కోసం అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమీషన్ ఇస్తామని ప్రకటించిందని, ఇంతవరకు ఆ హామీలు అమలు కావడం లేదన్నారు.
కమీషన్లు రాకపోవడంతో దుకాణం అద్దె, హమాలీ చార్జీలు, తూకం వేసే వారి వే తనాలు చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. డీలర్లు కమీషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వేరు, వేరుగా కాకుండా గతంలో మాదిరి ఒకేసారి విడుదల చే యాలని, ట్రెజరీ కార్యాలయంతో సంబంధం లేకుండా చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరి హమాలీ దిగుమతి చార్జీలు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశా రు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి హరీంద్ర, డీలర్లు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లు పనిచేయడం లేదనే కారణంతో పారితోషికం తగ్గించాలనే ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లు గ్రామాల్లో పలు సేవలు అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు. నెలకు రూ.18 వేల వేతనం అందించాలని, ఆరు నెలల పీఆర్సీ చెల్లించాలని, అర్హతలు కలిగిన వారికి ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తాము ఇండ్లను నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామస్థులు ఆందోళన చేశారు. నష్టపోయిన వారికి రూ.25 వేల పరిహారం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కార్యాదర్శి మల్లేశ్ పాల్గొన్నారు.