ఆదిలాబాద్ రూరల్, జూలై 10 : ఆదిలాబాద్‌లోని కుమ్రం భీం చౌక్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం రాత్రి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. కుమ్రం భీం చౌక్‌గా నామకరణం చేశారు. కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలివచ్చి తుడుం వాయిద్యాలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి మూలం అయ్యారన్నారు. తాజాగా లక్షలాది మందికి పోడు పట్టాలు అందజేసి రైతుబంధు కూడా వర్తింపజేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేశ్, కుమ్రం భీం మనువడు సోనేరావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
ఎదులాపురం, జూలై 10: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్‌లోని బంగారిగూడలో గల మదర్సాలో సోమవారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు. మైనార్టీలు విద్యాపరంగా రాణించాలన్న ఉద్దేశంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, గత ప్రభుత్వాల హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. ప్రతిపక్షాల మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలను నిజం చేసేలా కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్ పొందాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, మదర్సా నిర్వాహకులు అబ్దుల్ అజీమ్, అన్వర్ పాల్గొన్నారు.
రేషన్ దుకాణం ప్రారంభం
మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బొక్కలగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు బియ్యం అందించి నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. రేషన్ డీలర్ కొమ్ము శ్రీజారాములు ఎమ్మెల్యేతో పాటు ఆతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ సరకుల సరఫరాలో ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలపై ఎమ్మెల్యే స్పందించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. పేదలకు పది కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం రేషన్ దుకాణాలను ఎత్తివేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు పండ్ల శ్రీను, కొండ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.