ఇచ్చోడ, మే 1 ః మండల పరిధిలోని కోకస్మన్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 64 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్‌కు వస్తున్నది. దీని వెనుక ఆటోలో నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన ప్రయాణికులు ఆరుగురు ఆదిలాబాద్‌కు శుభకార్యానికి వెళ్తున్నారు.
రహదారిపై పశువులు అడ్డుగా రావడంతో పశువులను తప్పించేందుకు ఆర్టీసీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు వెనుకల ఉన్న ఆటో, ఎక్స్ఎల్ ద్విచక్రవాహనం, ఆయిల్ లారీ వేగంగా వచ్చి ద్విచక్రవాహనం, ఆటో, బస్సును ఢీకొట్టింది. అలాగే ఆయిల్ లారీ రోడ్డుపై ఉన్న నాలుగు పశువులను ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న భోరజ్ మండలంలోని మాండగడ గ్రామానికి చెందిన మేకల భీమక్క(60) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
బస్సు డ్రైవర్ ఎండీ అజీజ్, ప్రయాణికులు పవర్ పూలబాయి, లక్ష్మి, మౌనిక, అలాగే ఆటో డ్రైవర్ షేక్ జహీర్, షేక్ జావిద్, రేష్మా, సఫియా బేగం, సహిస్తా రుక్సాన, జుబియా ఫిర్దోస్, ఎక్స్ఎల్ ద్విచక్రవాహనంపై ఉన్న పవర్ నాందేవ్, పవర్ విక్రమ్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదం ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే అని ల్ జాదవ్ పరిశీలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతు న్న బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ రాథోడ్ జైసింగ్, వైద్యులు, నాయకులు ఉన్నారు.